సాక్షి, అమరావతి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో బొగ్గు నాణ్యత ఒక్కసారిగా పడిపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని ఇంధనశాఖ నిర్ణయించడంతో జెన్‌కో అధికారుల్లో కలవరం మొదలైంది.
నివేదిక ఇవ్వకుండా తాత్సారం
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సరఫరా అయ్యే బొగ్గు నాణ్యత తగ్గడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి కమిటీ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బొగ్గు క్షేత్రాల నుంచే నాసిరకం బొగ్గు వస్తోందా? లేదంటే మధ్యలో ఇంకేదైనా వ్యవహారం జరుగుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణపట్నం ప్లాంట్‌కు వచ్చే బొగ్గు పూర్తిగా తడిసిపోయి డొల్లగా ఉంటోందని, మండిస్తే సరైన ఉష్ణశక్తి రావడం లేదని ప్లాంట్ ఇంజనీర్లు ఇటీవల ఇంధనశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. కృష్ణపట్నం ఏపీపీడీసీఎల్ పరిధిలోది కావడంతో వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని జెన్‌కో ఎండీ ఆదేశించినట్టు తెలిసింది.
ఏపీపీడీసీఎల్ ముఖ్య అధికారి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వకుండా కాంట్రాక్టు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి నాసిరకం బొగ్గును ప్లాంట్‌కు చేరవేయడంలో కాంట్రాక్టర్ల హస్తం ఉందని, ఏపీపీడీసీఎల్ అధికారులు వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని బొగ్గు వాడటం వల్ల వినియోగం పెరిగి థర్మల్ ప్లాంట్ బాయిలర్స్‌పై ప్రభావం పడుతోందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.
ఏం జరుగుతోంది?
కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 1,600 మెగావాట్లు. ఇక్కడ నిత్యం 16 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగిస్తారు. ఈ ప్లాంట్‌కు మహానది కోల్ ఫీల్డ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేస్తోంది. ఒడిశాలోని తాల్చేరు గనుల నుంచి సేకరించే బొగ్గును సమీపంలోనే వాష్ చేస్తారు. ఓ ప్రైవేటు సంస్థకు ఈ కాంట్రాక్టు బాధ్యతను అప్పగించారు. వ్యర్థాన్ని తొలగించాక బొగ్గును నేరుగా పారాదీప్ పోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి సముద్రమార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టుకు చేరుతుంది.
అనంతరం కన్వేయర్ బెల్ట్ ద్వారా థర్మల్ ప్లాంట్‌కు నేరుగా చేరుతుంది. వాస్తవానికి బొగ్గు మైన్ దగ్గరే నాణ్యత పరీక్ష కోసం నమూనాలు సేకరిస్తారు. తర్వాత ప్లాంట్ దగ్గర మరో శాంపుల్ తీస్తారు. బొగ్గు క్షేత్రాల దగ్గర ఎంసీఎల్ తీసే శాంపుల్ 4,120 జీసీవీ (ఉష్ణశక్తి) వరకూ ఉంటుంది. కానీ ప్లాంట్‌లో ఇది 3,700 ఉంటోందని, గత నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉందని కృష్ణపట్నం సీనియర్ ఇంజనీర్లు గుర్తించారు.
ఉన్నతాధికారులు మాత్రం ఎంసీఎల్ శాంపుల్స్ నాణ్యతనే పరిగణలోనికి తీసుకుని వాస్తవాలను దాచిపెడుతున్నట్లు తెలిసింది. ఈ బొగ్గును కేంద్ర ప్రభుత్వ సంస్థ సింఫర్‌కు థర్డ్ పార్టీ పరీక్షకు పంపుతారు. దీన్ని కూడా కొంతమంది మేనేజ్ చేస్తున్నారని, నాణ్యత ఉన్న శాంపుల్స్ పంపుతున్నారని తెలిసింది. వాష్ చేసిన బొగ్గును ప్లాంట్‌కు చేరవేసే కాంట్రాక్టు సంస్థలు నాణ్యమైన బొగ్గును ఇతర ప్రైవేట్ సంస్థలకు అమ్ముకునే వీలుంది. అందుకనే నాసిరకం బొగ్గును కలుపుతున్నట్లు కృష్ణపట్నం ఇంజనీర్లు అనుమానిస్తున్నారు.
పోర్టులో గోల్‌మాల్?
పారాదీప్ లేదా కృష్ణపట్నం పోర్టులో గోల్‌మాల్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైవేట్ థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గును తరలిస్తూ కాంట్రాక్టు సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని, ఏపీపీడీసీఎల్ ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి.
దీనిపై జెన్‌కో అధికారులను సంప్రదించగా వర్షాల కారణంగా బొగ్గు తడిసి నాణ్యత తగ్గుతోందన్నారు. నాణ్యత తగ్గడంపై విచారణకు ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీనిపై ఏపీపీడీసీఎల్ సీజీఎం రాఘవేంద్రరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment