తాడిపత్రి నుంచి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి లారీలు
ఆర్టీపీపీ 600 మెగావాట్ల యూనిట్ వద్దే అడ్డుకున్న పోలీసులు
బకాయిలిచ్చి, రవాణాలో 50 శాతం వాటా ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే ఆది వర్గీయులు
భారీగా మోహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు..144 సెక్షన్ విధింపు
ఎర్రగుంట్ల/కొండాపురం: వైఎస్సార్ జిల్లాలోని డాక్టర్ ఎంవీఆర్‌ఆర్ ఆర్టీపీపీ నుంచి వెలువడుతున్న బూడిద (ఫ్లైయాష్) కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య రాజుకున్న రగడ చల్లారలేదు. ఆర్టీపీపీలో బుధవారం పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.
కలమల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ యామిని తెలిపారు. మరోవైపు.. తాడిపత్రి నుంచి బూడిద కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఆరు లారీలు వచ్చాయి. పోలీసులు వీటిని ఆర్టీపీపీ 600 మెగావాట్ల యూనిట్ వద్దే నిలిపేశారు. డ్రైవర్లను దించి లోడింగ్‌కు అనుమతిలేదని వారికి పోలీసులు తెలిపారు.
సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఉత్కంఠ..
మరోవైపు.. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండాపురం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి మండలంలోని కె.సుగుమంచిపల్లె చెక్‌పోస్టు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆర్టీపీపీకి వస్తారేమోనని సాయంత్రం వరకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఆయన రాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
బకాయిలిచ్చి 50 శాతం వాటా కల్పించాలి..
ఆర్టీపీపీలో ఉన్న యాష్ పాండ్ నుంచి వస్తున్న బూడిద సరఫరాకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను చెల్లించి, సరఫరాలో 50 శాతం వాటా కల్పించాలని ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. యాష్‌పాండ్‌లోని బూడిదను తాడిపత్రిలోని ఎల్ ఆండ్ టీ ఫ్యాక్టరీకి నేరుగా సరఫరా చేసేవాళ్లమన్నారు. అప్పుడు ఫ్యాక్టరీ వారు సకాలంలో బిల్లులు ఇచ్చేవారన్నారు.
కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకోవడంతో ఆయనకు బూడిదను సరఫరా చేశామన్నారు. అయితే, ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదన్నారు. సుమారు రూ.80 లక్షలు బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని.. అలాగే సరఫరాలో 50 శాతం వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తమ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డికి తెలియజేశామన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి లారీలకు లోడింగ్ చేయబోమని ఆయన తెగేసి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment