‘కొత్త’ వెలుగులు | Another 800 MW available electricity in telangana | Sakshi
Sakshi News home page

‘కొత్త’ వెలుగులు

Published Fri, Dec 28 2018 1:57 AM | Last Updated on Fri, Dec 28 2018 1:59 AM

Another 800 MW available electricity in telangana - Sakshi

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ (కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌) సుదీర్ఘ ప్రస్థానంలో 7వ దశ మరో సరికొత్త మైలురాయి కానుంది. ఈ ప్లాంట్‌ ద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్‌ రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం రాత్రి 7వ దశ ప్లాంట్‌ సీఓడీ (కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌) చేసి జాతికి అంకితం చేశారు. జూన్‌ 30న ఈ ప్లాంట్‌కు సంబంధించి సింక్రనైజేషన్‌ (మొదటిసారి విద్యుత్‌ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయడం) ప్రక్రియ పూర్తి చేశారు. అయితే వివిధ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యుదుత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. అనంతరం ఎన్నికలు రావడంతో సీఓడీ ప్రక్రియ ఆలస్యమైంది. 1966 జూలై 4 నుంచి వివిధ దశల్లో విస్తరిస్తూ వస్తున్న కేటీపీఎస్‌ రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడున్న 6 దశల ప్లాంట్ల ద్వారా (60 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్‌ మూతపడిన తర్వాత) 1,660 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. 7వ దశ ప్లాంట్‌ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర గ్రిడ్‌కు రోజూ 2,460 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కానుంది. 

అనేక అవాంతరాలను అధిగమిస్తూ.. 
2015 జనవరిలో 7వ దశ ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది అనేక అవాంతరాలను అధిగమిస్తూ తుది దశకు చేరుకుంది. 2017 సెప్టెంబర్‌ 27న హైడ్రాలిక్‌ టెస్ట్‌ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో ట్రాక్‌ ఆర్డర్‌ వద్ద టీపీ–3 ట్రాన్స్‌ఫార్మర్‌ కుప్పకూలింది. ఆ తర్వాత సాంకేతిక లోపంతో స్టేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇలాంటి పలు అవాంతరాలను అధిగమిస్తూ 7వ దశ నిర్మాణాన్ని బీహెచ్‌ఈఎల్‌ పూర్తి చేసింది. 2017 డిసెంబర్‌ 31 నాటికే పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణం ప్రారంభించారు. అయితే కొన్ని విభాగాల్లో పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పాటు పలు అవాంతరాలతో కొంత ఆలస్యమైంది.   

సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో.. 
కేటీపీఎస్‌లో ఇప్పటి వరకు ఉన్న 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లు సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ పద్ధతిలో విద్యుదుత్పత్తి చేసేవే. ఈ నేపథ్యంలో 7వ దశ ప్లాంట్‌ను ఆధునిక సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మించారు. సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో పోల్చుకుంటే సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీలో తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. 7వ దశలో భారీ నిర్మాణాలను బీహెచ్‌ఈఎల్‌ సంస్థ అనుకున్న సమయానికన్నా తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాయిలర్‌ను నిర్మించేందుకు 42 నెలలు నిర్దేశించుకోగా, 24 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇక కూలింగ్‌ టవర్‌ నిర్మాణ పనులు ఏడాదిన్నర ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో మిగిలిన నిర్మాణాలన్నీ ఆలస్యం అవుతాయని జెన్‌కో అధికారులు ఆందోళన చెందారు. 2016 జూలైలో ప్రారంభమైన కూలింగ్‌ టవర్‌ నిర్మాణం 2017 డిసెంబర్‌ నాటికి (18నెలల్లో) పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించినట్లు జెన్‌కో అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 275 మీటర్ల ఎత్తు గల చిమ్నీ(షెల్‌) నిర్మాణం పనులు 20 నెలల్లో విజయవంతంగా పూర్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement