రాష్ట్రంలో రోజుకి 238.79 మిలియన్ యూనిట్ల వాడకం
గతేడాది కంటే 43.01 శాతం ఎక్కువ
ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో పీక్ డిమాండ్
అవసరం మేరకు మార్కెట్‌లో కొనుగోలు
రోజుకి రూ. 35.25 కోట్లు వ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగంతో ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి వినియోగం 166.97 కంటే 43.01 శాతం ఎక్కువ.
రోజులో పీక్ డిమాండ్ 12,802 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 7,997 మెగావాట్లు మాత్రమే ఉంది. అంటే 60.09 శాతం పెరిగింది. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి.
ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా..
గత సంవత్సరం వేసవిలో మన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అంచనా. దీనికి తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది.
ఇబ్రహింపట్నంలోని ఎన్‌టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్–8లోనూ ఉత్పత్తి ముందుగానే ప్రారంభించారు. అలాగే వీటీపీఎస్‌లో రోజుకి 32,186 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 16,443 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 23,632 మెట్రిక్ టన్నులు, హిందూజాలో 14,277 మెట్రిక్ టన్నులు చొప్పున బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.
కొనుగోలుకు వెనుకాడని ప్రభుత్వం
రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీజెన్‌కో థర్మల్ నుంచి 91.081 మి.యూ, ఏపీ జెన్‌కో హైడల్ నుంచి 4.920 మి.యూ, ఏపీ జెన్‌కో సోలార్ నుంచి 2.269 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 35.925 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 32.213 మి.యూ, సోలార్ నుంచి 20.647 మి.యూ, విండ్ నుంచి 12.359 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది.
అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి రోజుకు యూనిట్ సగటు రేటు రూ. 8.764 చొప్పున రూ. 35.253 కోట్లతో 40.224 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జార్ఖండ్, ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మన దగ్గర కంటే తక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ కొరత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment