థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో విషవాయువులకు చెక్‌! | FGD Plant Construction At Singareni Thermal Power Station | Sakshi
Sakshi News home page

థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో విషవాయువులకు చెక్‌!

Published Fri, Feb 17 2023 2:28 AM | Last Updated on Fri, Feb 17 2023 3:03 PM

FGD Plant Construction At Singareni Thermal Power Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను కాలుష్యరహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ సిద్ధమైంది. రూ. 696 కోట్ల వ్యయంతో ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌ (ఎఫ్‌జీడీ) అనే అనుబంధ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి గాలిలోకి విడుదలయ్యే సల్ఫ్యూరిక్‌ ఆక్సైడ్‌ శాతం ప్రతి ఘనపు మీటర్‌కు 2000 మిల్లీగ్రాములులోపు ఉండాల్సి ఉండగా 200 మిల్లీగ్రాములకు తగ్గిస్తూ 2015లో కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఎఫ్‌జీడీల నిర్మాణం తప్పనిసరైంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి ఎఫ్‌జీడీ ప్లాంట్‌ ఇదే. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గును మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతతో నీటిని ఆవిరిగా మార్చి దానితో టర్బైన్లను తిప్పు తూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. బొగ్గును మండించ డం ద్వారా బూడిద, విషవాయువులు విడుదలవుతాయి. బూడిదను శుద్ధి చేసేందుకు సింగరేణి థర్మ ల్‌ విద్యుత్‌ కేంద్రంలో ‘ఎలక్ట్రో స్టాటిక్‌ ప్రెసిపిటే టర్స్‌’అనే అనుబంధ విభాగాన్ని వినియోగిస్తున్నా రు. సల్ఫ్యూరిక్‌ ఆక్సైడ్‌ శుద్ధికి ఎఫ్‌జీడీ రానుంది. 

20 శాతం పనులు పూర్తి... 
సింగరేణిలో ఎఫ్‌జీడీ నిర్మాణ పనులను పీఈఎస్‌ ఇంజనీర్స్‌ సంస్థకు అప్పగించగా ఇప్పటికే 20% ప నులను పూర్తి చేసింది. మొత్తం పనులను 2024 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ఆదేశించారు. ఎఫ్‌జీడీ నిర్మాణంపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.  

ఎఫ్‌జీడీ పనితీరు ఇలా... 
బొగ్గు మండించినప్పుడు వెలువడే వాయువుల్లోంచి సల్ఫర్, అనుబంధ వాయువులను ఎఫ్‌జీడీ ప్లాంట్‌ వేరు చేస్తుంది. దీనికోసం 150 మీటర్ల ఎత్తయిన ఒక చిమ్నీనీ ఏర్పాటు చేస్తారు. ఈ చిమ్నీలో కింది నుంచి పైకి వచ్చే వాయువుపై క్యాల్షియం కార్బొనేట్‌ (తడి సున్నం)ను పైనుంచి బలంగా పంపి స్తారు. దీంతో వాయువుల్లోని సల్ఫర్‌ డై ఆక్సైడ్‌తో తడి సున్నం రసాయనిక చర్యకు లోనవుతుంది.

సల్ఫర్, అనుబంధ వాయువులన్నీ తడి సున్నంలో కలుస్తాయి. ఫలితంగా బయటకు విడుదలయ్యే వా యువుల్లో సల్ఫర్‌ అనుబంధ వాయువుల శాతం ఘ నపు మీటర్‌కు 200 మిల్లీగ్రాములకు తగ్గిపోతుంది. ఈ ప్రక్రియలో అంతిమంగా ఏర్పడే క్యాల్షియం సల్ఫేట్‌ (జిప్సం) అనే ఘన పదార్థాన్ని ఎరువులు, సిమెంట్, పేపర్, వస్త్ర పరిశ్రమ, నిర్మాణ రంగానికి సరఫరా చేయనున్నారు. జిప్సం అమ్మకాలతో థర్మల్‌ ప్లాంట్‌ నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement