సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజెన్‌కో) చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా థర్మల్ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన బొగ్గు సరఫరాను పెంచడానికి వివిధ సంస్థలతో ఇంధన సరఫరా ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
అందులో భాగంగా.. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించింది. ఈ బొగ్గు సరఫరా సోమవారం నుంచి రైలుమార్గంలో మొదలైంది.
ఫలించిన నిరంతర ప్రయత్నం..
ఏపీజెన్‌కో, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు 5,811 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనికోసం ఎంసీఎల్ నుంచి సంవత్సరానికి 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎస్‌ఏ) చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు రాష్ట్రంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్‌టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్‌టీపీపీ)లకు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. అయితే, కొంతకాలంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడటంతో సరఫరా కూడా మందగించింది. కేంద్ర ప్రభుత్వమే థర్మల్ కేంద్రాలకు బొగ్గు కోటాను నిర్ణయించడం మొదలుపెట్టింది. మరోవైపు.. థర్మల్‌కు బొగ్గు నిల్వలను సమకూర్చుకోవాలని కూడా నిర్దేశించింది.
ఈ నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నిరంతర పర్యవేక్షణలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు కోల్ ఇండియా లిమిటెడ్, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌తో సంప్రదింపులు జరిపారు. దీంతో ఈ ఏడాది మార్చి 10 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల యూనిట్‌కు మే 1 నుంచి బొగ్గును కేటాయించడానికి ఎంసీఎల్
అంగీకరించింది.
మరింత మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి
కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ యూనిట్‌తో రాష్ట్రంలోని రోజువారీ విద్యుత్ అవసరాలకు దాదాపు 16 మిలియన్ యూనిట్లు సమకూరుతున్నాయి. మహానది నుంచి దీనికి బొగ్గును సరఫరా చేయడంవల్ల విద్యుదుత్పత్తి మెరుగుపడుతుంది. తద్వారా అన్ని రంగాలకు ఎలాంటి లోడ్ రిలీఫ్ (ఎల్‌ఆర్)లు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పెరుగుతున్న స్టేట్ గ్రిడ్ డిమాండ్‌ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది.
– కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్‌కో
Comments
Please login to add a commentAdd a comment