నత్తనడక
► పవర్ ప్రాజెక్టు పనుల తీరుపై సింగరేణి సీఎండీ అసంతృప్తి
► మే వరకు 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావాలని ఆదేశం
► ఆకస్మికంగా సందర్శించిన సీఎండీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ముఖ్యంగా కొన్ని విభాగాల పనులు ఏళ్లు గడుస్తున్నా ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఈ పనుల తీరుపై సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎన్.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్లాంటు పనులను పరిశీలించారు. సుమారు మూడు గంటలపాటు అన్ని పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. యాష్‌హ్యాండ్లింగ్ ప్లాంటు, పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. ఇక్కడ కొనసాగుతున్న పైప్‌లైన్ పనుల తీరుపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు.
యాష్‌పాండ్, బొగ్గు రవాణా, కన్వేయర్ బెల్ట్ తదితర పనుల పట్ల కూడా సీఎండీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫ్లైయాష్ ప్లాంటు, కోల్‌హాప్పర్ ప్లాంట్లకు సంబంధించి కూలింగ్ టవర్ల నిర్మాణం పనులను కూడా ఆయన పరిశీలించారు. వీటి నిర్మాణం కోసం నిర్దేశిత కాల పరిమితిలో పనులు పూర్తి చేయని పక్షంలో సంబంధిత నిర్మాణ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగరేణి స్థానిక అధికారుల తీరుపై కూడా సీఎండీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనులు సకాలంలో పూర్తి చేయని ఏజెన్సీల పట్ల కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అధికారులతో సమీక్ష..
అనంతరం నిర్మాణ ఏజెన్సీలతో పనులపై సమీక్ష నిర్వహించిన సీఎండీ మే నెలాఖరు వరకు రెండు ప్లాంట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా ఈ ప్లాంటు నుంచి 1,200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగించాలన్నారు. అవసరమైతే ఎక్కువ మంది సూపర్‌వైజర్లను, సిబ్బందిని, కార్మికులను నియమించుకోవాలని ఆదేశించారు. మొదటి యూనిట్ సింక్రనైజేషన్ విజయవంతంగా పూర్తి చేశామని, రెండో యూనిట్ కూడా సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి మే నెలాఖరు కల్లా రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలన్నారు.
సీఎండీ వెంట సింగరేణి డెరైక్టర్లు బి.రమేష్ కుమార్, ఎ.మనోహర్‌రావు, జె.పవిత్రన్ కుమార్, పి.రమేష్‌బాబు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజయసూర్, కోఆర్డినేషన్ జీఎం జె.నాగయ్య, సివిల్ జీఎం మురళీకృష్ణ, ఈఅండ్‌ఎం జీఎం సుధాకర్‌రెడ్డి, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.