సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గతేడాది కనకవర్షం కురిపించింది. టర్నోవర్, లాభాలు, బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు అంశాల్లో గణనీయ వృద్ధి సాధించి పాత రికార్డులను అధిగమించింది. సంస్థ 2017–18లో రికార్డు స్థాయిలో రూ.1,200 కోట్ల లాభాలు ఆర్జించింది. 2016–17లో సాధించిన రూ.395 కోట్ల లాభాలతో పోల్చితే గతేడాది సాధించిన లాభాలు 203 శాతం అధికం కావడం గమనార్హం. 2016–17లో రూ.17,743 కోట్ల టర్నోవర్ సాధించగా, గతేడాది రూ.22,667 కోట్ల టర్నోవర్ సాధించి 27.8 శాతం వృద్ధి నమోదు చేసింది. 2016–17లో 608 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగా, 2017–18లో 646 లక్షల టన్నులకు పెంచి 6.2 శాతం వృద్ధిని సాధించింది. 26.9 శాతం వృద్ధి రేటుతో 396 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగించింది. గత 4 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటూ రానున్న 5 ఏళ్లలో సుమారు రూ.12 వేల కోట్ల భారీ వ్యయంతో అభివృద్ధి ప్రణాళికను అమలు చేయనున్నామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ రికార్డు స్థాయిలో ప్రగతి సాధించడానికి కారణమైన కార్మికులకు అభినందనలు తెలిపారు.
రానున్న ఐదేళ్లకాలంలో 13 కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తామనీ, దీంతో బొగ్గు ఉత్పత్తి 850 లక్షల టన్నులకు పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.22,667 కోట్ల టర్నోవర్ మరో 5 ఏళ్లలో రూ.34,000 కోట్లకు చేరుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కారుణ్య నియామకాల అమలు, మ్యాచింగ్ గ్రాంటును పది రెట్లు పెంచి పంపిణీ చేయడం, సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం, కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపు పథకం, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, ఐఐటీ, ఐఐఎంలో చదివే కార్మికుల పిల్లలకు కంపెనీ ద్వారా ఫీజుల చెల్లింపు, లాభాల బోనస్‌ను 25 శాతానికి పెంచి కార్మికులకు అందజేయడం, పండుగ అడ్వాన్సును భారీగాపెంచి పంపిణీ చేయడం, తెలంగాణకోసం పాటుపడిన కార్మికులందరికీ 2014 నుండి తెలంగాణ ఇంక్రిమెంటు అమలు జరపడం, మెడికల్ అన్‌ఫిట్ కేసులో ఉద్యోగం వద్దనుకొనే వారికి ఏకమొత్తంగా రూ.25 లక్షల చెల్లింపు లేదా నెలకు రూ.25 వేల చెల్లింపు పథకం, అన్ని గనుల్లో క్యాంటీన్ల ఆధునీకరణ, అంబేడ్కర్ జయంతి, రంజాన్, క్రిస్టమస్ పండుగలను సెలవు దినాలుగా గుర్తింపు వంటివి అమలు జరుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశంపై సింగరేణి సంస్థలో ఖాళీలను గుర్తించి 7,200 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించామని, అలాగే 2,718 మంది బదిలీ వర్కర్లను ఒకేసారిగా జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశామన్నారు.
సింగరేణికి రూ.1,200 కోట్ల లాభాలు
Published Tue, Apr 3 2018 3:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment