సింగరేణి బోనస్‌ రూ.1,00,899 | Singareni Employees Get Over Rs 1 Lakh Bonus For Dasara | Sakshi
Sakshi News home page

సింగరేణి బోనస్‌ రూ.1,00,899

Published Fri, Sep 20 2019 2:15 AM | Last Updated on Fri, Sep 20 2019 8:21 AM

Singareni Employees Get Over Rs 1 Lakh Bonus For Dasara - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా పండుగ కానుకను ప్రకటించారు. సింగరేణి ఆర్జిస్తున్న లాభాల్లో కార్మి కులకి 28% వాటా ఇస్తున్నట్లు ప్రకటిం చారు. లాభాల్లో వాటా పెంచడంతో ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌గా అందనున్నట్లు వెల్లడించారు. గతేడాది అందించిన బోనస్‌ కన్నా ఈ ఏడాది రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సింగరేణి కాలరీస్‌ అంశంపై సీఎం కీలక ప్రకటన చేశారు. సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైందన్నారు. 

రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి
యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడిందని, సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డుస్థాయి ఉత్పత్తి చేయడానికి ఈ పరిణామం దోహదపడిందని సీఎం తెలిపారు. ‘2013–14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగారు. గత ఐదేళ్లలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. 2018–19 సంవత్స రంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. 2013–14లో సింగరేణి సంస్థ రూ.418 కోట్ల లాభం గడించింది. గత ఐదేళ్లలో ఇది ప్రతి ఏటా పెరుగుతూ 2018–19 నాటికి రూ.1,765 కోట్ల లాభాన్ని సింగరేణి సంస్థ సాధించగలిగింది’అని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాలనకు ప్రతీకగా..
ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణి సాధిస్తున్న ప్రగతి తెలంగాణ ప్రభుత్వ పాలనకు ప్రతీకగా నిలుస్తోందని సీఎం కేసీఆర్‌ కితాబిచ్చారు. కోల్‌ ఇండియాతో పోల్చితే సింగరేణి ఎంతో మెరుగ్గా ఉండటం మనందరికి కూడా గర్వకారణమని, ఇంతటి సహకారం అందిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలిపారు. ‘సమైక్య పాలనలోని చివరి సంవత్సరమైన 2013–14లో కార్మికులకు ఒక్కొక్కరికి రూ.13,540 చొప్పున బోనస్‌ చెల్లించారు. తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో కార్మికులకు ఇచ్చే బోనస్‌కు క్రమంగా పెంచుతూ వస్తోంది. 2017–18లో లాభాల్లో 27 శాతం వాటాగా ఒక్కొక్క కార్మికుడికి రూ.60,369ను చెల్లించింది.

ఈసారి లాభాల్లో వాటాను మరో శాతానికి అంటే 28 శాతానికి పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నా. లాభాల్లో వాటా పెంచడం వల్ల ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌గా అందుతుంది. గతేడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుక’అని సీఎం ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి మరిన్ని లాభాలు, విజయాలు సాధించిపెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement