సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో 25 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా చెల్లించాలని యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఆదేశించారు. గతంలో ప్రకటించిన పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్ రూ. 57 వేలతోపాటు లాభాల బోనస్‌ను శుక్రవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇది మొత్తం రూ. 98.84 కోట్లు కానుంది.
వాస్తవానికి పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్‌ను అక్టోబర్ రెండో వారంలో దీపావళి పండుగకు ముందుగా చెల్లించాలని ప్రకటించినప్పటికీ వెనువెంటనే వచ్చిన పండుగలు, కార్మికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు బోనస్‌లు కలిపి ఒకే దఫాగా శుక్రవారం చెల్లించాలని సీఎం ఆదేశించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కార్మికుల ఖాతాల్లో బోనస్ జమ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 25 శాతం లాభాల వాటా బోనస్ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు రానుంది.
దీనికి దీపావళి బోనస్ రూ. 57వేలను కలపనున్నారు. మొత్తంగా ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ. 72 వేల నుంచి రూ. 77 వేల మధ్య జమ కానుంది. ఈ నెల 22న యాజమాన్యం దసరా పండుగ అడ్వాన్సుగా ప్రతి కార్మికుడికి రూ. 25 వేలు చెల్లించింది. మొత్తంగా పండుగల సీజన్లో ప్రతి కార్మికుడు సగటున లక్ష రూపాయలు పొందగలిగాడు. దసరా పండుగ అడ్వాన్సుగా ఈ నెల 22న రూ. 120 కోట్లు చెల్లించిన యాజమాన్యం... దీపావళి బోనస్‌గా రూ. 336 కోట్లు, లాభాల వాటా కింద రూ. 98.84 కోట్లు కలిపి మొత్తం రూ. 434 కోట్లను శుక్రవారం చెల్లించనుంది.
పెరిగిన లాభాల వాటా...
తెలంగాణ ఆవిర్భావానికి ముందు కార్మికులకు లాభాల బోనస్ 20 శాతం లోపే ఉండేది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గత మూడేళ్లుగా లాభాల్లో కార్మికుల వాటాను పెంచుకుంటూ వస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. తెలంగాణ రాకముందు లాభాల బోనస్ 18 శాతం ఉండగా తెలంగాణ వచ్చాక దాన్ని 2014–15లో 21 శాతానికి, 2015–16లో 23 శాతానికి పెంచగా 2016–17కి సంబంధించి తాజాగా 25 శాతానికి పెంచినట్లు వెల్లడించారు.