
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2017–18లో రూ.1,212 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. అన్ని రకాల పన్నుల చెల్లింపుల తర్వాత ఈ మేరకు లాభాలు మిగిలాయన్నారు. 2016–17లో ఆర్జించిన రూ.395 కోట్ల లాభాలతో పోల్చితే గతేడాది 207 శాతం అధిక లాభాలను సంస్థ ఆర్జించిందని చెప్పారు. సింగరేణి భవన్‌లో బుధవారం నిర్వహించిన సంస్థ బోర్డు సమావేశంలో రూ.1,212 కోట్ల లాభాలను ఆమోదించామన్నారు. లాభాల్లో కార్మికుల వాటాను త్వరలో బోనస్‌గా చెల్లిస్తామని వెల్లడించారు. దీని గురించి సీఎం కేసీఆర్‌ను సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.
కార్మికులు, అధికారులు, సూపర్‌వైజరీ సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా లాభాలు సాధించగలిగామన్నారు. ఇదే ఒరవడిని ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించాలని కోరారు. కార్మికులకు లాభాల్లో మంచి వాటాతో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు రూ.60 కోట్ల నిధులతో సింగరేణి వ్యాప్తంగా కార్మిక కాలనీల్లోని నివాస గృహాలన్నింటికీ ఏసీ కనెక్షన్లు జారీ చేయాలనే ప్రతిపాదనలను ఆమోదించినట్లు తెలిపారు. వివిధ ఓపెన్ కాస్ట్, భూగర్భ గనులకు సంబంధించిన పనులు, కొనుగోలు తదితర అంశాలకు అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఈ సమావేశంలో ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment