మాట్లాడుతున్న సింగరేణి సీఎండీ శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూ బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలు తీసుకుంటున్న సింగరేణికి మరో వందేళ్లకుపైగా ఉజ్వల భవిష్యత్ ఉందని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అన్నారు. మరో ఐదేళ్లలో 10 కొత్త గనులు, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో సుస్థిర ఆర్థిక పునాదులు ఏర్పరచుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్.. సింగరేణి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. అనంతరం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సారి బొగ్గు ఉత్పత్తి 50 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగిందని, టర్నోవర్ రూ.12 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెరిగిందని వివరించారు.
ఇదే ఒరవడితో తదుపరి రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.2 వేల కోట్ల లాభాల దిశగా పురోగమిస్తున్నామని వెల్లడించారు. సింగరేణి సంస్థ నెలకొల్పిన థర్మల్ విద్యుత్ కేంద్రం 90 శాతంపైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను సాధించి దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను అధిగమించి జాతీయ స్థాయిలో నంబర్ 1గా నిలవడం సింగరేణి కార్మికుల పనితీరుకు, అంకితభావానికి నిదర్శనని పేర్కొన్నారు.
సింగరేణి పనితీరుకు మెచ్చి సీఎం కేసీఆర్.. మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ అందించే థర్మల్ విద్యుత్ 2 వేల మెగావాట్లకు చేరుతుందని, అలాగే ప్రస్తుతం నిర్మించిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు అదనంగా మరో 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.
పలువురికి సన్మానాలు
ఈ సందర్భంగా సింగరేణి భవన్ నుంచి ఎంపిక చేసిన ఉత్తమ అధికారులు.. డీజీఎం(ఐటీ) గడ్డం హరిప్రసాద్, ఎస్‌ఓఎం (మార్కెటింగ్) సురేందర్ రాజు, ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ అహ్మద్, ఎంవీ డ్రైవర్ సుధాకర్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ(కోల్ మూవ్‌మెంట్) జె.అల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, సీఎంవోఏఐ సాధారణ కార్యదర్శి ఎన్.వి.రాజశేఖరరావు, అడ్వైజర్(లా) లక్ష్మణ్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment