SCCL CMD N. Sridhar
-
సింగరేణికి మరో వందేళ్ల ఉజ్వల భవిష్యత్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూ బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలు తీసుకుంటున్న సింగరేణికి మరో వందేళ్లకుపైగా ఉజ్వల భవిష్యత్ ఉందని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అన్నారు. మరో ఐదేళ్లలో 10 కొత్త గనులు, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో సుస్థిర ఆర్థిక పునాదులు ఏర్పరచుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్.. సింగరేణి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. అనంతరం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సారి బొగ్గు ఉత్పత్తి 50 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగిందని, టర్నోవర్ రూ.12 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. ఇదే ఒరవడితో తదుపరి రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.2 వేల కోట్ల లాభాల దిశగా పురోగమిస్తున్నామని వెల్లడించారు. సింగరేణి సంస్థ నెలకొల్పిన థర్మల్ విద్యుత్ కేంద్రం 90 శాతంపైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను సాధించి దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను అధిగమించి జాతీయ స్థాయిలో నంబర్ 1గా నిలవడం సింగరేణి కార్మికుల పనితీరుకు, అంకితభావానికి నిదర్శనని పేర్కొన్నారు. సింగరేణి పనితీరుకు మెచ్చి సీఎం కేసీఆర్.. మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ అందించే థర్మల్ విద్యుత్ 2 వేల మెగావాట్లకు చేరుతుందని, అలాగే ప్రస్తుతం నిర్మించిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు అదనంగా మరో 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. పలువురికి సన్మానాలు ఈ సందర్భంగా సింగరేణి భవన్ నుంచి ఎంపిక చేసిన ఉత్తమ అధికారులు.. డీజీఎం(ఐటీ) గడ్డం హరిప్రసాద్, ఎస్ఓఎం (మార్కెటింగ్) సురేందర్ రాజు, ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ అహ్మద్, ఎంవీ డ్రైవర్ సుధాకర్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ(కోల్ మూవ్మెంట్) జె.అల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, సీఎంవోఏఐ సాధారణ కార్యదర్శి ఎన్.వి.రాజశేఖరరావు, అడ్వైజర్(లా) లక్ష్మణ్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ పాల్గొన్నారు. -
5 ఏరియాలు టాప్, మరో ఆరు ఏరియాల్లో వెనుకంజ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్‌లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్‌లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్‌లో 20 ఓపెన్‌కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్‌తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్‌లోని మణుగూరు టాప్‌గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్‌లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
సింగరేణి సీఎండీగా శ్రీధర్ ఇంకెంతకాలం?
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం పొడిగింపు పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం తెలిపింది. కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో గత నెల 30న నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో శ్రీధర్ పదవీకాలం పొడిగింపునకు వ్యతిరేకంగా తమ శాఖ అండర్ సెక్రటరీ ఆల్కా శేఖర్ ఓటు వేశారని, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ నెల 8న లేఖ అందిన విషయాన్ని రాష్ట్ర ఇంధన శాఖ, సింగరేణి సంస్థ అధికారవర్గాలు ధ్రువీకరించాయి. 2015 జనవరి 1 నుంచి సంస్థ సీఎండీగా శ్రీధర్ కొనసాగుతున్నారు. చదవండి: సింగరేణికి సోలార్ సొబగులు ఈ నెల 31తో శ్రీధర్ పదవీకాలం ముగియనుండగా, ప్రభుత్వం తదుపరి ఆదే శాలు జారీ చేసే వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని గత నెల నిర్వహించిన ఏజీఎంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేంద్రం వ్యతిరేకించినా, రాష్ట్ర ప్రభుత్వ వాటాదారుల మద్దతుతో ఆమోదం పొందింది. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలుండటంతో మెజారిటీ ఓట్ల మద్దతుతో ఈ తీర్మానం నెగ్గింది. తర్వాత శ్రీధర్ పదవీకాలాన్ని మరో ఏడాదికాలం పాటు పొడిగిస్తూ ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీధర్‌కు అప్పటినుంచి ఎక్స్టెన్షన్ ఇస్తూ వస్తున్నారు. అలా మొత్తం ఆరేళ్లు పనిచేసిన శ్రీధర్‌ను మరో ఏడాది కొనసాగించడంపై కేంద్రం సుముఖంగా లేదు. శ్రీధర్ పదవికి ప్రమాదం లేదు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవికి ఎలాంటి ప్రమాదం లేదని, మరో ఏడాది పాటు ఆయనే సీఎండీగా కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి. సీఎండీ కొనసాగింపు పట్ల కేంద్రం వ్యతిరేకత చూపుతున్నా, మెజారిటీ వాటాదారుడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. -
ప్రభుత్వానికి సింగరేణి రూ.132 కోట్ల డివిడెండ్
హైదరాబాద్: సింగరేణి కాలరీస్ సంస్థ (ఎస్సీసీఎల్) తెలంగాణా ప్రభుత్వానికి రూ.132 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా ఎస్సీసీఎల్ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారని సింగరేణి కాలరీస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2013-14లో కంపెనీ రూ.418 కోట్లు నికర లాభాన్ని అర్జించిందని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. కంపెనీ ఉత్పత్తిలో రెండంకెల వృద్ధిని సాధించటానికి తగిన చర్యల్ని తీసుకుంటామని, పవర్ ప్లాంటు కార్యకలాపాలను షెడ్యూల్ ప్రకారం ప్రారంభించటానికి కృషి చేస్తానని వివరించారు.