భారీగా పెరిగిన భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల అంచనా వ్యయం
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి వాదనలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం గుదిబండగా మారిందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన బీహెచ్‌ఈఎల్‌కు పనులు అప్పగించడం, కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడమే దీనికి కారణమన్నారు. రూ.7,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించగా, వాస్తవ వ్యయం రూ.10 వేల కోట్లు దాటిందన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ముందు బుధవారం హాజరై తమ పిటిషన్లకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తికాక ముందే రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభమైందని, విద్యుత్ కొరత తీర్చడంలో ఈ విద్యుత్ కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదన్నారు.
విద్యుత్ కొరతను అధిగమించే సాకుతో టెండర్లు లేకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని తెలిపారు. 2017లో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చేనాటికే భూపాలపల్లిలో 800 మెగావాట్ల కేటీపీపీ, జైపూర్ (మంచిర్యాల జిల్లా)లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్‌తోపాటు జూరా లలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అందుబాటులోకి వచ్చిందని తిమ్మారెడ్డి కమిషన్‌కు వివరించారు.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాకున్నా విద్యుత్ లైన్ల కోసం రూ.630 కోట్లను చెల్లించారని తప్పుబట్టారు. యూనిట్‌కు రూ.3.90 ధరతో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వస్తుందని ఒప్పందం చేసుకోగా, వాస్తవ ధర రూ.5.40కు పెరిగిందన్నారు. ఆ సమయంలో దేశంలో రూ.4.20కే కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా విద్యుత్ లభించిందని ఆధారాలను కమిషన్‌కు అందజేశారు.
మూడేళ్ల తర్వాతే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వచ్చింది..
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం 2014లో జరిగితే మూడేళ్ల తర్వాత 2017–18 నుంచి సరఫరా ప్రారంభమైందని, 1000 మెగావాట్లకు గాను 75 శాతమే వచ్చిందని వేణుగోపాల్‌రావు అన్నారు. విద్యుత్ బిల్లుల వివాదంతో 2022 ఏప్రిల్ నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.10–20 వరకు అధిక ధరతో రాష్ట్రం విద్యుత్ కొనాల్సి వచ్చిందన్నారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా అయ్యేందుకు 1000 మెగావాట్ల పవర్ గ్రిడ్ లైన్లను బుక్ చేసుకోగా, పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోయినా రూ.650 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను బుక్ చేసుకొని రద్దు చేసుకోవడంతో రూ.261 కోట్లను పరిహారంగా చెల్లించాలని ఎలక్రి్టసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో పవర్‌గ్రిడ్ దావా వేసిందని పేర్కొన్నారు. ఒప్పందం మేరకు రావాల్సిన విద్యుత్ రాకున్నా ఛత్తీస్‌గఢ్‌కు రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment