ఖాకీల పడగ నీడలో.. | Police Firing at Thermal Power Station | Sakshi
Sakshi News home page

ఖాకీల పడగ నీడలో..

Published Fri, Jan 3 2014 4:45 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Police Firing at Thermal Power Station

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పోలీసుల దాష్టీకంతో ఆ ఎనిమిది పల్లెలు క్షణ క్షణం భయంతో వణికిపోతున్నాయి. మగవాళ్లందరూ ఊళ్లలోంచి పారిపోవటంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు బితుకుబితుకుమంటూ క్షణమొక యుగంలా బతుకుతున్నారు. కాకరాపల్లిలో ఈస్టుకోస్ట్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు గత నెల 31న అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో      ఖాకీల పడగ నీడలో..ఇళ్లలోకి చొరబడి పలువురిని అరెస్ట్ చేసినప్పటి నుంచి హనుమంతనాయుడు పేట, ఆకాశలక్కవరం. బాలానాయుడు పేట, పోతినాయుడు పేట, యామలపేట, నవాబుపేట, సీతారామపురం(టెంకపేట), శీరపుపేట గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 
 
 పస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరాహార దీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులేవీ లేవు. అయినా ఎందుకు అరెస్ట్‌లు చేస్తున్నారో తెలియక  ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, హనుమంతునాయుడు పేటకు చెందిన శీరపు నరసింహమూర్తి, దల్ల చిన్న ఎర్రయ్య, కొయ్య ప్రసాదరెడ్డి, ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన కప్ప గవర్రాజు, లింగూడు నాగేశ్వరావు, బాలానాయుడు పేటకు చెందిన బుడ్డెపు తేజారావు, నీలాపు అప్పలస్వామిలను 31 అర్ధరాత్రి అరెస్ట్ చేసి మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. వీరికి గురువారం బెయిల్ రాగా జైలు నుంచి బయటకు రాగానే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో థర్మల్ గ్రామాల్లో భయోత్పాత్పం సృష్టించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమవుతున్నది.
 
 పోలీసోళ్లు భయపెడుతున్నరు...
 పోలీసులు అరెస్ట్‌లు చేసిన గ్రామాలతోపాటు మరో ఐదు గ్రామాల్లో ‘సాక్షి ప్రతినిధి’ గురువారం పర్యటించారు. ఏ గ్రామంలోనూ యువకులు కనిపించలేదు. మహిళలు, వృద్ధులు దీనస్థితిలో ఇళ్ల ముందు, గోడల చాటున కూర్చొని కనిపించారు. ఎవరిని కదిలించినా ఒకటే మాట. ‘పోలీసోళ్లు ఇష్టమొచ్చినట్లు భయపెడుతున్నరు. బయటకు పోవాలంటేనే భయంగా ఉంది. మొగోళ్లు ఊళ్లు వదిలి వె ళ్లిపోయారు. పోలీసోళ్లు వెళితేనే తిరిగొస్తారు. గొడ్డూ గోదా ఎలాగున్నాయో చూడండి. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు’ అని పలువురు మహిళలు వాపోయారు. 
 
 అడుగడుగునా పోలీసులు...
 సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం రైల్వేగేట్ వద్ద నుంచి జగన్నాథపురం గ్రామం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో రోడ్డు వెంట పోలీసులు పహారా కాస్తూ కనిపించారు. ప్రతి ఊరి పొలిమేర వద్ద గస్తీ తిరుగుతున్నారు. ఎవరు వెళ్లినా.. ఎందుకొచ్చారంటూ కొరకొరగా చూస్తున్నారు. హనుమంతనాయుడుపేటలోకి వెళ్లేందుకు సాక్షి బృందం పొలిమేర వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ఎదురుగా వాహనాన్ని ఆపింది. అయితే పోలీసులు ఇక్కడ ఆపేందుకు వీలులేదంటూ ఊరిబయటకు పంపేశారు. అక్కడ ఎవరూ నిలబడేందుకు వారు అంగీకరించలేదు. పాఠశాల గదులన్నీ పోలీసుల బ్యాగులతో నిండిపోయాయి. దీంతో టీచర్లు, పిల్లలు ఒకే హాలులో కిక్కిరిసి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా కూర్చున్నారు. 
 
 తమ వాహనాలను రోడ్లపైనే నిలబెట్టారు. అక్కడి పరిస్థితులు చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ప్లాంట్ వాహనాలకు ప్రత్యేక బందోబస్తు తో లోపలికి తీసుకెళుతున్నారు. ప్రభుత్వ అధికారులు ప్లాంట్‌లోకి వెళ్లి అక్కడివారికి భరోసా ఇచ్చి రావటం కనిపించారు. లోపలికి వెళ్లేందుకు సాక్షి బృందాన్ని అనుమతించలేదు. సాక్షి ప్రతినిధి సంస్థ సీఈవోకు ఫోన్ చేస్తే ఒకసారి రింగయింది. రెండోసారి చేస్తే స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ప్లాంట్ గేట్ ముందు పోలీసులు ప్రత్యేక టెంట్ వేసుకుని కాపలా కాస్తున్నారు. నిజానికి ప్లాంట్ వద్దకు రెండేళ్లుగా ఉద్యమకారులు, బాధితులు వెళ్లనేలేదు. పైగా సంస్థ వారు తమకు కేటాయించిన స్థలంలో నిలువెత్తు గోడలు నిర్మించారు. ఆ గోడల చుట్టూ పోలీసులు ఇనుప ముళ్ల కంచెలు వేశారు. ఏ విధమైన ఆందోళనలు లేనప్పటికీ ఈ స్థాయిలో పోలీసులను ఎందుకు మోహరించారన్నది తెలియటం లేదు. 
 
 చిన్న సంఘటనకు అరెస్ట్‌లు.. భారీ సంఖ్యలో పోలీసులా!?
 వాస్తవానికి ఇటీవల కొంతమంది ఆందోళనకారులు, భారీ వాహనాలు గ్రామాల్లోని రోడ్లపై నుంచి ప్లాంట్ ఆవరణలోకి పోకుండా అడ్డుకున్నారు. రహదార్లు పూర్తిగా కుంగిపోతుండటంతో ఈ చర్య చేపట్టారు. దీంతో సంస్థ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే తక్షణం వందల సంఖ్యలో పోలీసులు దిగిపోయారు.
 బెయిల్‌పై విడుదలైన నిందితులు జైలు గోడలు దాటగానే మళ్లీ అరెస్ట్‌డిసెంబర్ 31న పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు కోర్టులో గురువారం బెయిల్ తీసుకున్నారు. బెయిల్ కాగితాలను నరసన్నపేటలోని సబ్‌జైలుకు తీసుకువెళ్లిన కానిస్టేబుల్ వాటిని జైలర్‌కు ఇవ్వగానే నిందితులను విడుదల చేశారు. కానీ వారు జైలు గోడ దాటగానే అక్కడే మధ్యాహ్నం నుంచి కాపుకాచి ఉన్న ఎస్‌ఐతోపాటు మరికొందరు పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పోలీసులు  కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఈ సంఘటన రుజువు చేస్తున్నది.
 
 మా మొగోళ్లెప్పుడొత్తారో..
 ‘పోలీసోళ్లు పోవడం లేదు.. మా మొగోళ్లు ఊళ్లోకి రావడం లేదు.. ఈళ్లెప్పుడు పోతారో.. ఆళ్లెప్పుడు వత్తారో.. ఏం చేత్తాం... ఎవరికి చెప్పుకుంటాం.. ఎవరికీ ఈ కష్టం రాకూడదయ్యా’..అని హనుమంతునాయుడు పేటకు చెందిన పలువురు మహిళలు వాపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement