
ఉచిత విద్యుత్ పథకం అమలు కొనసాగేనా ?
తెలంగాణలో ఒక ఏడాదికి అవసరమయ్యే ఉచిత విద్యుత్ -11,460 మిలియన్ యూనిట్లు.. అంటే రోజుకుసగటున 31.40 ఎంయూలు
తెలంగాణలో మొత్తం ఉత్పాదక సామర్థ్యం రోజుకు-75 ఎంయూలు
వేసవి, రబీ సీజన్‌లో మొత్తం విద్యుత్ డిమాండ్ 150-160 ఎంయూలు
అంటే రబీ సీజన్‌లో 75 నుంచి 80 ఎంయూల విద్యుత్ మార్కెట్‌లో కొనాల్సిందే
ఒక్క రోజుకే రూ. 42 కోట్ల నుంచి రూ. 51 కోట్లు వెచ్చించాలి
ఈ లెక్కన నాలుగు నెలల రబీ సీజన్‌కే రూ. 5,100 కోట్లు-రూ. 6,120 కోట్లు ఖర్చు చేయాలి
ఏడాది అంతా అంటే రూ. 10 వేల కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి
ఈ భారమంతా ప్రభుత్వమే భరిస్తుందా..? లేదా రైతులపైనే మోపుతుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకం అమలు చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ లోటును ఎదుర్కొనే తెలంగాణ ప్రాంతంలో ఈ పథకం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉచిత విద్యుత్ కనెక్షన్లు 31,75,512 ఉండగా.. అందులో ఒక్క తెలంగాణలోనే 18.22 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అంటే మొత్తం కనెక్షన్లలో 57.38 శాతం తెలంగాణలోనే ఉన్నాయన్న మాట. విభజన ప్రక్రియ తర్వాత ఉచిత విద్యుత్ పథకానికే తెలంగాణలో రోజుకు సగటున 31 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కుపైగా విద్యుత్ అవసరం ఏర్పడనుంది. ఇంత భారీ ఎత్తున విద్యుత్‌ను సరఫరా చేయాలంటే మార్కెట్లో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందే. ఇప్పటికే ప్రస్తుతం విద్యుత్ కొరత పేరుతో పరిశ్రమలకు నెలలో 18 రోజుల పాటూ కోతలు అమలవుతున్నాయి.
మరోవైపు వ్యవసాయానికి 7 గంటలు ఇస్తున్నామని చెబుతున్నా.. 2-3 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక విభజన అనంతరం... విద్యుత్ లోటు సమస్యను ఎదుర్కొనే తెలంగాణ ప్రాంతంలో ఉచిత విద్యుత్ పథకం పరిస్థితి ఏమవుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఈ పథకం అమలయ్యే అవకా శం ఉందా? విద్యుత్ లోటు పేరుతో వ్యవసాయానికి 7 గంటల సరఫరా కాస్తా మరింత తగ్గుతుందా? మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి రానుండటంతో ఆ భారాన్ని చార్జీల రూపంలో రైతులపైనే వేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డిమాండ్ ఆకాశంలో.. సరఫరా పాతాళంలో..: తెలంగాణలోని జెన్‌కోకు చెందిన థర్మల్ పవర్ ప్లాంట్ల సామర్థ్యం 2,282.5 మెగావా ట్లు. జల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,541.8 మెగావాట్లు. సోలార్ పవర్ ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ వస్తుంది. అంటే తెలంగాణలో మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 4,825.3 మెగావాట్లు. అయితే జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. మొత్తమ్మీద కేవలం థర్మల్ విద్యుత్ కేంద్రాలను (2282.5 మెగావాట్లు) తీసుకుంటే... రోజుకు 50 ఎంయూల (అంతర్గత వినియోగం పోను) మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనితో పాటు ప్రస్తుతం కేంద్ర విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 1,250 మెగావాట్లు వస్తుందనుకుంటే.. రోజుకు 25 ఎంయూల మేరకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం విద్యుత్ ఉత్పత్తి 75 ఎంయూ మేర ఉండనుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 250 ఎంయూ డిమాండ్ ఉంటుందని అంచనా.
ఇందులో తెలంగాణ ప్రాంతంలో 120-125 ఎంయూ విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఇంధనశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అంటే సుమారు 50 శాతం డిమాండ్ కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉండనుంది. వేసవి, రబీ సీజన్‌లో తెలంగాణలో డిమాండ్ ఏకంగా 150-160 ఎంయులకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన రబీ సీజన్‌లో 75 ఎంయూ నుంచి 85 ఎంయూ వరకూ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి రానుంది. ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ ధర సగటున 5-6 రూపాయల దాకా ఉంది. ఈ ధరతో 85 ఎంయూలు.. అంటే 8.5 కోట్ల యూనిట్లను కొనుగోలు చేయాలంటే... రోజుకు రూ.42.5 కోట్ల నుంచి రూ.51 కోట్ల మేర వెచ్చించాల్సి రానుంది.
నాలుగు నెలల రబీ సీజనుకే ఏకంగా రూ.5,100 కోట్ల నుంచి రూ.6,120 కోట్ల దాకా వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ఏడాది మొత్తం లోటును పూడ్చేందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే ఈ మొత్తం రూ.10 వేల కోట్లకు చేరనుంది. ఇంత పెద్దమొత్తంలో భారాన్ని ప్రభుత్వం భరించే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఈ భారాన్ని రైతులపైనే మోపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ భారీ మొత్తాన్ని వెచ్చించి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయలేకపోతే... ఆ మేరకు పరిశ్రమలతో పాటు ఉచిత విద్యుత్ సరఫరా సమయం బాగా తగ్గుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ విద్యుత్ కొనుగోలు చేసినప్పటికీ.. సరఫరా చేసుకునేందుకు విద్యుత్ సరఫరా లైన్ల (కారిడార్) సమస్య కూడా తెలంగాణను వేధించనుంది. ఇక ఖరీఫ్‌లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే విద్యుత్ ఉత్పత్తికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ వర్షాభావ పరిస్థితుల్లో రబీలో మాదిరే బయటి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.12 వేల ఎంయూలు! : ఉచిత విద్యుత్ కోసం 2012-13 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 11,460 ఎంయూల మేర విద్యుత్ సరఫరా అయ్యింది. ఇందులో సీపీడీసీఎల్ పరిధిలో 6,743 ఎంయూలు, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 4,747 ఎంయూలు సరఫరా అయ్యింది. సీపీడీసీఎల్ పరిధిలో తెలంగాణ జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా ఉన్నాయి. సీపీడీసీఎల్ పరిధిలో వ్యవసాయానికి 9,173 ఎం యూ విద్యుత్‌ను సరఫరా చేశారు. రాయలసీమలోని ఈ రెండు జిల్లాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా చేసిన ఉచిత విద్యుత్ మొత్తం (అనంతపురం జిల్లాకు 1,615 ఎం యూలు, కర్నూలుకు 815 ఎంయూలు) 2,430 ఎంయూలను మినహాయిస్తే 6,743 ఎంయూలు తెలంగాణ జిల్లాలకే సరఫరా అయ్యింది. మొత్తమ్మీద రెండు డిస్కంలను కలుపుకుంటే తెలంగాణలో వ్యవసాయానికి ఉచితం కోసం అవసరమయ్యే విద్యుత్ మొత్తం 11,460 ఎంయూలన్నమాట! అంటే రోజు కు సగటున 31.40 ఎంయూల విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేయాల్సి రానుంది. కొత్త వ్యవసాయ కనెక్షన్లు జారీ అవుతుండటంతో ఈ డిమాండ్ కాస్తా ఏటా పెరుగుతూనే ఉంటుంది. అంటే వచ్చే ఏడాదిలో కేవలం వ్యవసాయానికే 12 వేల ఎంయూలకు పైగా విద్యుత్ కేవలం వ్యవసాయానికే సరఫరా చేయాల్సి రానుంది.
భవిష్యత్తులో మరింత కష్టం..: ప్రతి ఏటా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లను కొత్తగా మంజూరు చేస్తున్నారు. ఇందులో ప్రతీ ఏటా తెలంగాణ ప్రాంతంలోనే 80 వేల నుంచి 90 వేల కనె క్షన్లు మంజూరు చేస్తున్నారు. ఈ లెక్కన వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఏటా పెరుగుతూనే పోతుందన్నమాట. ఫలితంగా సరఫరా కూడా భారీగా పెరగాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వృద్ధిరేటు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున 6 నుంచి 10 శాతం పెరుగుతోంది. అయితే ఉచిత విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఈ వృద్ధిరేటు సగటున 10 శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తై వాటి నిర్వహణకు ఏకంగా 8,682.18 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. అంటే రోజుకు సగటున 208.37 ఎంయూల విద్యుత్ కేవలం ఎత్తిపోతల పథకాలకే అవసరం కానుంది. వీటికి విద్యుత్ సరఫరా అసాధ్యమే.