
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలకొన్న తాత్కాలిక ఒడిదుడుకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాజా పరిస్థితులపై సోమవారం రాష్ట్ర ప్రజలకు ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని, మన రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనని ఆయన పేర్కొన్నారు.
జెన్‌కో కేంద్రాల మూసివేత అనాలోచితం కాదు
► జెన్‌కో కేంద్రాలను అనాలోచితంగా మూసివేయలేదు. బహిరంగ మార్కెట్‌లో జెన్‌కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం.
► బొగ్గు కొరత దృష్ట్యా యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్‌టీటీపీ)లో వార్షిక మరమ్మతులు చేపట్టాం. ఇలా చేయకపోయినా బొగ్గు కొరత వల్ల వాటిని మూసివేయాల్సి వచ్చేది.
► తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదు. అక్కడున్న బొగ్గు నిల్వలను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడం లేదు. మనం శ్రీశైలంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మనవి చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment