
సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలపై విధించిన ఆంక్షలను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు.
విద్యుత్ సరఫరాపై పరిశ్రమలకు విధించిన కొద్దిపాటి ఆంక్షలను వీలైనంత త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిపై డిస్కంల సీఎండీలు స్పందిస్తూ.. బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ అంతరాయాలు లేకుండా గృహాలకు నిరంతరం, వ్యవసాయానికి పగటిపూట 7గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డైరెక్టర్ ఏవీకే భాస్కర్, డిస్కంల సీఎండీలు సంతోషరావు, పద్మజనార్ధనరెడ్డి, హరనాథరావు పాల్గొన్నారు.