
సాక్షి, అమరావతి: విద్యుత్ కొరత తాత్కాలికమేనని, ఈ నెలాఖరు నాటికి సరఫరా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా ఈ నెల 18న విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి తొలి సమీక్ష నిర్వహించనున్నారు.
ఇదీ పరిస్థితి..
దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా డిమాండ్, సరఫరాలో అంతరం తలెత్తి పలు రాష్ట్రాలు విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నాయని ఇంధన శాఖ అధికారులు మంత్రి పెద్దిరెడ్డికి తెలియచేశారు. బొగ్గు కొరతతో మహారాష్ట్రలో 1375 మెగావాట్ల లోడ్ చొప్పున రోజూ 3 గంటల పాటు లోడ్ రిలీఫ్ విధిస్తుండగా గుజరాత్‌లో పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే అమలు చేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో గురువారం 208 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఏపీ జెన్‌కో నుంచి 71 ఎంయూ, కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి 40 ఎంయూ, జల విద్యుత్తుతో 6.6 ఎంయూ, సౌర విద్యుత్తుతో 24 ఎంయూ, పవన విద్యుత్ 16 ఎంయూ, హిందుజా 9.4 ఎంయూ, ఇతర ఉత్పత్తి కేంద్రాల ద్వారా 4 ఎంయూ, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి దారుల నుంచి 11 ఎంయూల చొప్పున మొత్తం 182 మిలియన్ యూనిట్లు సమకూరిందని వివరించారు. మరో 26 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నాటికి విద్యుత్ సరఫరా చాలావరకు మెరుగుపడుతుందని వెల్లడించారు. రాబోయే 25 ఏళ్ల పాటు వ్యవసాయ విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు.
ఇబ్బందుల్లోనూ నాణ్యమైన కరెంట్
బహిరంగ మార్కెట్‌లో కూడా తగినంత విద్యుత్ దొరకని పరిస్థితుల్లోనూ గృహ వినియోగదారులకు వీలైనంత మేర తక్కువ అంతరాయాలతో నాణ్యమైన కరెంట్ సరఫరా జరుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మే 1నుంచి రైతులకు పగటిపూటే 9 గంటలు అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు. గృహ, వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. నవరత్నాల అమల్లో భాగంగా విద్యుత్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యుత్తు రంగాన్ని ఆదుకునేందుకు రెండున్నరేళ్లలో దాదాపు రూ.35 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు.