
ప్రతీకాత్మక చిత్రం
శాంతిపురం/తిరుపతి రూరల్: టీడీపీ నాయకులు ప్రమాదం పేరిట విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించి, విద్యుత్ కోతలపై నిరసనలకు దిగిన వ్యవహారంపై ఎస్పీడీసీఎల్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ హరనాథరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీ నాయకులు శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కెనమాకులపల్లిలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని శాంతిపురం సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు.
కరెంటు పోగానే విద్యుత్ కోతలకు నిరసనగా గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఎమ్మెల్సీ భరత్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.హరిని విచారణ అధికారిగా నియమించింది. ఘటనతో సంబంధం ఉన్న షిఫ్ట్ ఆపరేటర్‌ను తొలగించేందుకు ఆదేశాలిచ్చారు. విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులైన ఇతర అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై చర్యలకు సిఫార్సు చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నట్టు పేర్కొన్నారు.