విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు గండం! | Danger coal to power plants! | Sakshi
Sakshi News home page

విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు గండం!

Published Mon, Jun 23 2014 1:31 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు గండం! - Sakshi

విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు గండం!

ఏ రోజుకారోజు  నెట్టుకొస్తున్న థర్మల్ కేంద్రాలు
 
ఇప్పటికే ఆర్‌టీపీపీలో మూడు యూనిట్ల మూత
ఇతర కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి
ఎన్‌టీటీపీఎస్‌లో 10 వేల టన్నులకు
పడిపోయిన నిల్వలు
బొగ్గు సరఫరా పెంచాలని కేంద్రానికి
ఏపీ సర్కారు మొర


హైదరాబాద్: ఆంధప్రదేశ్‌పైకి కారుచీకట్లు కమ్ముకొస్తున్నాయి! కరెంటు కటకటలు మరింత తీవ్రమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ర్టంలోని కీలకమైన థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఒక్కొక్కటిగా మూతపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు యూనిట్లలో ఉత్పత్తి క్రమంగా నిలిచిపోతోంది. దీనికంతటికీ కారణం బొగ్గు కొరత. రోజువారీ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు లేక విద్యుత్ కేంద్రాలన్నీ విలవిల్లాడుతున్నాయి. ఏ రోజుకారోజు అతి కష్టంమీద నెట్టుకొస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్‌టీపీపీ)లో బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. కనీసం ఒక్క టన్ను కూడా నిల్వ లేదు. దీంతో వచ్చిన బొగ్గును వచ్చినట్టే బాయిలర్‌లోకి పంపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అదీ సరిపోక ఇప్పటికే 1, 2, 3వ యూనిట్లను పూర్తిగా నిలిపేశారు. ఫలితంగా 660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. మిగిలిన రెండు యూనిట్ల(ఒక్కోటి 210 మెగావాట్ల సామర్థ్యం) పరిస్థితి కూడా దారుణంగా ఉంది. బొగ్గు వస్తేనే ఉత్పత్తి జరుగుతోంది. ఏ క్షణమైనా అవి మూతపడే ప్రమాదంలో ఉన్నాయి.  ప్రస్తుతం ఆర్టీపీపీలో దిగుమతి చేసుకున్న బొగ్గు ఐదు వేల టన్నులు మాత్రమే ఉందని ఆర్టీపీపీ ఇన్‌చార్జి చీఫ్ ఇంజనీర్ దేవేంద్రనాయక్ తెలిపారు. బంకర్లలో ఉన్న బొగ్గుతో కొన్ని యూనిట్లను..

అది కూడా తక్కువ సామర్థ్యంతో నడుపుతున్నట్లు చెప్పారు. వార్షిక మరమ్మతుల వల్ల మరో 15 రోజుల పాటు ఒకటో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. అంటే అప్పటివరకు 210 మెగావాట్ల విద్యుత్‌ను కోల్పోవాల్సి వస్తుందన్నమాట! విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్‌టీటీపీఎస్)లో ఇప్పటికే ఒక యూనిట్‌లో 210 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కేంద్రంలో 10 వేల టన్నులకు బొగ్గు నిల్వలు పడిపోయాయి. వాస్తవానికి ఎన్‌టీటీపీఎస్‌లోని అన్ని యూనిట్లు నడవాలంటే రోజుకు 28 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతమున్న సరకు సగం రోజుకు కూడా సరిపోదన్నమాట! ఈ నేపథ్యంలో బొగ్గు సరఫరాను తక్షణం పెంచాలని రాష్ర్ట ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఒప్పందం మేరకు మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్) నుంచి బొగ్గును పంపాలని కేంద్రానికి మొరపెట్టుకుంటోంది. ప్రస్తుతం ఎంసీఎల్ నుంచి రోజుకు 15 వేల టన్నుల బొగ్గు మాత్రమే వస్తోందని.. దీనిని ఒప్పందం మేరకు 30 వేల టన్నులకు పెంచాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు శనివారం లేఖ రాశారు.
 
ఆర్టీపీపీకి విద్యుదుత్పత్తి గండం  

ఎర్రగుంట్ల: రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)కు బొగ్గు గండం ఏర్పడింది.  బొగ్గు లేని కారణంగా అదివారం 2,3 యూనిట్లను నిలిపి వేశారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో బొగ్గు నిల్వ లేదు. బంకర్లలో ఉన్న బొగ్గుతోనే 1,4,5 యూనిట్లు రన్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి బొగ్గు రాక పోతే  విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆర్టీపీపీలో బొగ్గు కొరత  కొన్ని నెలలుగా పట్టిపీడిస్తున్నా ప్రభుత్వం శ్రద్ధ  చూపడంలేదు. దీంతో ఆర్టీపీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటడంతో అధికారులు చేసేది లేక 2,3 యూనిట్లను ఆపివేశారు. 1,4,5 యూనిట్లలో లోడ్ తగ్గించి రన్ చేస్తున్నారు. మూడు యూనిట్లకు కలిపి 360 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఈ  విషయంపై ఆర్టీపీపీ ఇన్‌చార్జి సీఈ దేవేంద్రనాయక్‌ను వివరణ కొరగా బొగ్గు నిల్వలు లేవని అన్నారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఇంపోర్టు  కోల్ ఐదువేల టన్నులు మాత్రం ఉందని అన్నారు. బొగ్గు రేక్‌లు వస్తే యూనిట్లు నడుపుతామన్నారు.
 
విద్యుత్ రంగంలో స్వయం వృద్ధి: బాబు

విద్యుత్ రంగంలో స్వయం వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పదేళ్లలో గాడితప్పిన విద్యుత్ రంగాన్ని సమూలంగా సంస్కరించి తిరిగి పట్టాలపైకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇంధనశాఖ అధికారులతో ఆయన ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమలకు, గృహాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement