సాక్షి, కడప: ఒరిస్సా నుంచి బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచి పోవడం, తెలంగాణా రాష్ట్రంలోని సింగరేణి నుంచి అరకొరగా మాత్రమే వస్తుండటంతో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుదుత్పత్తి పడిపోయింది. 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 6వ యూనిట్‌లో శనివారం రాత్రి నుంచి విద్యుదుత్పత్తి నిలిపేశారు.ఆరుయూనిట్లలో ఇప్పటికే 2,5 యూనిట్లు పనిచేయడంలేదు. ప్రస్తుతం 1,3,4 యూనిట్ల పరిధిలో ఆదివారం నాటికి 510 మెగావాట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీపీలో ఆరు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1650 మెగావాట్లు. ఆరు యూనిట్లకు కలిపి ప్రతిరోజూ 20 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. ఒరిస్సా రాష్ట్రం తాల్చేరు ప్రాంతంలోని మహానది బొగ్గుగనుల నుంచి ప్రతిరోజూ 4 నుండి 5 రేక్స్(వ్యాగన్లు) బొగ్గు సరఫరా అయ్యేది. ఒక్కో రేక్ 3500 టన్నుల లెక్కన రోజూ 14 వేల నుంచి 16 వేల టన్నులు వచ్చేది.తెలంగాణలోని సింగరేణి నుంచి నిత్యం 3 రేక్స్(వ్యాగిన్లు) చొప్పున 10 వేల టన్నులకు తగ్గకుండా సరఫరా అయ్యేది. దీంతో ఆర్టీపీపీలో బొగ్గు సమస్య ఎప్పుడో కానీ తలెత్తేది కాదు. ఇక్కడ లక్ష టన్నుల వరకు బొగ్గు నిల్వలు ఉన్న సందర్భాలు ఉన్నాయి.
వర్షాలు, సమ్మెతో కష్టాలు
ఒరిస్సాలో కార్మికుల సమ్మెకు వర్షాలు తోడుకావడంతో ఆర్టీపీపీకి రెండు వారాలుగా బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. తెలంగాణ నుంచి వెయ్యి టన్నులు మాత్రమే వస్తోంది.దీంతో 20 వేల టన్నులు అవసరమైన ఆర్టీపీపీలో పలు యూనిట్లలో విద్యుత్పత్తి నిలిపి వేయాల్సి వచ్చింది. ప్రధానంగా ఆరో యూనిట్‌లో శనివారం నుంచి అధికారులు ఉత్పత్తి నిలిపి వేశారు. జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మె నేపథ్యంలో ఒరిస్సా నుంచి బొగ్గు సరఫరా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీంతో సింగరేణి నుంచి రాష్ట్రానికి బొగ్గు సరఫరాను మరింత పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎంను కోరారు. ఉన్నత స్థాయి అధికారులు సైతం సింగరేణి నుంచి మరింత బొగ్గును తీసుకు వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఐదు వేల టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉంది.
సింగరేణి నుంచి వచ్చే బొగ్గును శుభ్రం చేయకుండానే యూనిట్లకు తరలించాల్సి వస్తోంది. ఏ ఒక్కరోజు బొగ్గు సరఫరాకు ఆటంకం కలిగినా ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. ఆర్టీపీపీ 1991లో ప్రారంభమైంది. 1995లో 1, 2 యూనిట్లలో విద్యుత్పత్తి ప్రారంభించారు. ఒక్కో యూనిట్ 210 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించారు. తర్వాత రెండవ దశలో 2004లో ఇదే సామర్థ్యంతో 3, 4 యూనిట్లకు విస్తరించారు. 2008లో 5వ యూనిట్‌ను ప్రారంభించారు. 600 యూనిట్ల సామర్థ్యంతో 6వ యూనిట్‌ను ఏడాది కిందట ప్రారంభించారు. వెంటనే ప్రభుత్వం తెలంగాణ నుంచి బొగ్గు సరఫరా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీపీపీ అధికారులు, కార్మికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment