సాక్షి, అమరావతి: దేశంలో ఏర్పడ్డ బొగ్గు కొరత నుంచి పలు రాష్ట్రాలు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే ఉన్నాయి. ఎక్కడా ఆరు రోజులకు మించి నిల్వలు లేవు. రానున్న వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగి ఈ సమస్య మరింత అధికమయ్యే అవకాశాలున్నట్టు విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ సేవలతో ముడిపడి ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సంస్థలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా పవర్ బ్యాకప్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించాయి. ఈ మేరకు తమ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఐటీ సంస్థలు ఈ–మెయిల్స్ పంపాయి. కరోనా నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ అవకాశం కల్పించాయి. దాదాపుగా 90 శాతం ఐటీ నిపుణులు ఇంటినుంచే సేవలందిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు అనివార్యమైతే సమస్యలు తలెత్తి పని ఆగిపోకుండా ముందే జాగ్రత్త పడాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి.
ముందస్తు వ్యూహంతో సమస్యను అధిగమించిన ఏపీ
దేశవ్యాప్తంగా మొత్తం 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండగా.. 83 కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటిలో 6 కేంద్రాల్లో అసలు బొగ్గు లేదు. 12 కేంద్రాల్లో ఒక రోజుకు, 17 కేంద్రాల్లో 2 రోజులకు, 17 కేంద్రాల్లో 3 రోజులకు, 8 కేంద్రాల్లో 4 రోజులకు, 13 కేంద్రాల్లో 5 రోజులకు, 10 కేంద్రాల్లో 6 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో బొగ్గు కొరతను అధిగమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 3 నుంచి 5 రోజులకు సరిపడా ఉన్నాయి.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం.. శుక్రవారం నాటికి దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్‌లో మూడు రోజులకు సరిపడా 46,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో 49,100 మెట్రిక్ టన్నులు బొగ్గు ఉండగా.. రెండు రోజులకు సరిపోతుంది. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 89,300 మెట్రిక్ టన్నులు ఉండటంతో ఐదు రోజుల ఉత్పత్తికి ఢోకా లేదు.
విద్యుత్, బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదని.. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం ఎక్కడ అందుబాటులో ఉన్నా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (ఎస్‌డీఎస్‌టీపీఎస్)లో భవిష్యత్ అవసరాల కోసం విదేశీ బొగ్గును ఏపీ జెన్‌కో సమీకరిస్తోంది. ఈ టెండర్ ప్రక్రియ పూర్తయితే 4 నెలల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ బొగ్గు కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎస్‌డీఎస్‌టీపీఎస్‌కు చేరుకుంటుంది.
రాష్ట్రంలో ఇబ్బంది లేదు
రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత లేదు. అవసరమైన మేరకు నిల్వలున్నాయి. భవిష్యత్‌లో తలెత్తే కొరతను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాం. విదేశీ బొగ్గు కోసం ఈ నెల 20న టెండర్లు ఆహ్వానించాం. 28వ తేదీ వరకూ టెండర్ దాఖలుకు గడువు ఇచ్చాం. ఒకే టెండర్ రావడంతో ఆ గడువును సోమవారం వరకూ పొడిగించాం.
– బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్‌కో
Comments
Please login to add a commentAdd a comment