అవన్నీ అనవసరమైన భయాందోళనలు | Centre govt rebuts fears of power blackouts | Sakshi
Sakshi News home page

అవన్నీ అనవసరమైన భయాందోళనలు

Published Mon, Oct 11 2021 4:55 AM | Last Updated on Mon, Oct 11 2021 5:03 AM

Centre govt rebuts fears of power blackouts - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ ఎన్‌టీపీసీ, రిలయెన్స్‌ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్‌ సరఫరా కంపెనీలు, విద్యుత్‌ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్‌ డిమాండ్‌కు  తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని,  అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్‌ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు.

సమాచార లోపమే కారణం  
గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌), ఢిల్లీలోని డిస్కమ్‌ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్‌లకి, గెయిల్‌కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్‌ సప్లయ్‌ చేయలేమని గెయిల్‌ రాసిన లేఖతో విద్యుత్‌ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రాసిన లేఖపై లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్‌  సరఫరా చేయమని గెయిల్‌ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి.  

గుజరాత్‌లో టాటా పవర్‌ ఉత్పత్తి నిలిపివేత
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్‌ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌కు 1,850 మెగావాట్లు, పంజాబ్‌కు 475, రాజస్తాన్‌కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంది.  

బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే..
బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్‌ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్‌ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్‌ కంపెనీ, క్యాప్టివ్‌ కోల్‌మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్‌ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్‌ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్‌ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్‌ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్‌ నుంచి సెపె్టంబర్‌ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది.  

అప్పట్లో ఆక్సిజన్‌కూ కొరత లేదన్నారు: సిసోడియా
కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్‌కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కే. సింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్‌ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement