న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపు 76 శాతం అవసరాలను థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే సమకూర్చుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,750 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభలో విద్యుత్, పునరుత్పాదక ఇంథన శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మిస్తున్న భిన్నరకాల విద్యుత్ ప్లాంట్ల వివరాలనూ మంత్రి వెల్లడించారు.
‘మొత్తంగా 25వేలకుపైగా మెగావాట్ల సామర్థ్యంతో 18 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి గ్యాస్ ఆధారిత థర్మల్ ప్లాంట్ ఉంది. మొత్తంగా 18వేల మెగావాట్ల సామర్థ్యంతో 42 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 8వేల మెగావాట్ల సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సామర్థ్యం దేశం సొంతం. 3.6 శాతం మిగులును సాధించాం. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడూ 0.7 శాతం మిగులును సాధించాం’ అని మంత్రి వెల్లడించారు. అయితే 2023 ఏప్రిల్–జూన్ కాలంలో మాత్రం 0.2 శాతం లోటు కనిపించిందని మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి వెల్లడించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment