Energy Minister
-
37,490 మెగావాట్ల సోలార్‌పార్క్‌లు.. ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే..
దేశవ్యాప్తంగా పరిశ్రమలు, గృహావసరాలకు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కానీ అందుకు సరిపడా కరెంట్ తయారవడం లేదు. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి బదులుగా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను తయారుచేయాలని చాలాకాలంగా అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ ఏడాది నవంబర్ 30 వరకు 37,490 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 50 సోలార్ పార్కులకు ఆమోదం తెలిపినట్లు మంగళవారం పార్లమెంటులో వెల్లడింకచారు. ప్రభుత్వం 40 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ పార్లమెంట్లో తెలిపారు. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ పథకం కింద నవంబర్ 30 నాటికి దేశంలోని 12 రాష్ట్రాల్లో 37,490 మెగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను మంజూరు చేసినట్లు సింగ్ చెప్పారు. ఇప్పటికే 10,401 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 19 సోలార్ పార్కులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? రాష్ట్రాల వారీగా గుజరాత్లో సుమారు 12,150 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (8,276 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్ (4,200 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (4,180 మెగావాట్లు), ఉత్తర్‌ప్రదేశ్ (3,730 మెగావాట్లు), కర్ణాటకలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌పార్క్‌లు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. జార్ఖండ్‌లో 1,089 మెగావాట్లు, మహారాష్ట్రలో 750 మెగావాట్లు, కేరళలో 155 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 100 మెగావాట్లు, మిజోరాంలో 20 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు కూడా మంజూరైనట్లు వివరించారు. -
76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపు 76 శాతం అవసరాలను థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే సమకూర్చుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,750 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభలో విద్యుత్, పునరుత్పాదక ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మిస్తున్న భిన్నరకాల విద్యుత్ ప్లాంట్ల వివరాలనూ మంత్రి వెల్లడించారు. ‘మొత్తంగా 25వేలకుపైగా మెగావాట్ల సామర్థ్యంతో 18 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి గ్యాస్ ఆధారిత థర్మల్ ప్లాంట్ ఉంది. మొత్తంగా 18వేల మెగావాట్ల సామర్థ్యంతో 42 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 8వేల మెగావాట్ల సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సామర్థ్యం దేశం సొంతం. 3.6 శాతం మిగులును సాధించాం. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడూ 0.7 శాతం మిగులును సాధించాం’ అని మంత్రి వెల్లడించారు. అయితే 2023 ఏప్రిల్–జూన్ కాలంలో మాత్రం 0.2 శాతం లోటు కనిపించిందని మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి వెల్లడించడం గమనార్హం. -
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, మరో 100 ఛార్జింగ్ స్టేషన్లకు కసరత్తు
సాక్షి, విజయవాడ: ఇంధన భద్రతను పెంచడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వాతావరణంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత ఆశాజనక మార్గాలలో ఒకటైన ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) రాష్ట్రంలో 250 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించిందని ఇంధన, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ భవానీపురంలోని రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ ద్వారా పనిచేసే సైన్స్ ఎగ్జిబిడ్స్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారని ఏపీసమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్కోస్ట్) సహకారంతో ఎన్ఆర్ఈడీసీఏపీ ఏర్పాటు చేసిన పునరుత్పాదక ఇంధన వనరుల కేంద్రాన్ని(ఆర్ఈఆర్సీ) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఈ-మొబిలిటీకి ఒక నమూనాగా, పునరుత్పాదక ఇంధనానికి నాలెడ్జ్ హబ్ గా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీ రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయడం, రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి ఈ -మొబిలిటీ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ను మంత్రి అభినందించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందన్నారు. భారతదేశం బయో ఇంధనాలు, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా తదుపరి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుందని గుర్తుచేశారు. ఈ -మొబిలిటీని స్వీకరించడానికి దోహదపడే ఛార్జింగ్ స్టేషన్ల యొక్క బలమైన ఇంధన నెట్ వర్క్ ను నిర్మించే లక్ష్యంతో 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగా నగర పరిధిలో 3 కి.మీ x 3 కి.మీ గ్రిడ్ లోపల మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ మరియు ఎనర్జీ కన్జర్వేటివ్ కాన్సెప్ట్ ల గురించి సందర్శించే విద్యార్థులకు సౌలభ్యంగా సుమారు 30 పునరుత్పాదక ఇంధన గాడ్జెట్ లను ప్రదర్శించడానికి ఆర్ఈఆర్ సీ ఏర్పాటుకు చొరవ చూపినందుకు ఈ సందర్భంగా ఎన్ఆర్ఈడీసీఏపీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. నెట్ జీరో ఎమిషన్స్ టూరిస్ట్ ప్లేస్ గా తిరుపతిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తిరుపతిలో ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పటివరకు తిరుపతి పట్టణంలో సుమారుగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నా యన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయన్నారు. సంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రయోజనకరంగా ఉండటమేగాకుండా స్థానిక పర్యావరణాన్ని రక్షించి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయని సూచించారు. ఆర్ ఈఆర్ సీ సెంటర్ గురించి మాట్లాడుతూ అన్ని వయసుల విద్యార్థులకు అభ్యసన అవకాశాలను పెంపొందించేందుకు ఆర్ఈఆర్సీ దోహదపడుతుందన్నారు. అంతకుముందు విద్యుత్ వాహనాలను వాడుదాం-స్వావలంబన సాధిద్దాం, దేశ ప్రగతికి తోడ్పడుదాం లాంటి ఫ్లకార్డుల ప్రదర్శనతో మంత్రి పెద్దిరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సైన్స్ వరల్డ్ లో ఏర్పాటు చేసిన సర్ సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, ఆర్కిమెడిస్, ఆల్ బర్ట్ ఐన్ స్టీన్, చార్లెస్ డార్విన్, మేరీ క్యూరీ, బెంజ్ మెన్ ఫ్రాంక్లిన్,ఐజాక్ న్యూటన్, విక్రమ్ సారాబాయి, హోమీ జహంగీర్ బాబా తదితర శాస్త్రవేత్తలు వారు చేసిన కృషిని వివరిస్తూ ఉన్న ఎగ్జిబిషన్ ను, రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన మినియేటర్ న్యూక్లియర్ గ్యాలరీని మంత్రి తిలకించారు. అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా, డిజిటల్ టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. రీజినల్ సైన్స్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్థన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి, సభ్య కార్యదర్శి డాక్టర్ వై. అపర్ణ, జనరల్ మేనేజర్లు కె.శ్రీనివాస్, జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీనివాస్ రావు, ఎన్ఆర్ ఈడీసీఏపీ అధికారులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
హరిత హైడ్రోజన్‌కు త్వరలో మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా హరిత హైడ్రోజన్ తయారీకి భారత్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దే విధంగా త్వరలోనే ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం 15 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంపై (పీఎల్ఐ) కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి దీన్ని 60 గిగావాట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రోలైజర్లను తక్కువ సుంకాలతో ఎప్పటివరకూ దిగుమతి చేసుకోవచ్చనేది కేంద్రం నిర్దిష్ట గడువు నిర్దేశిస్తుందని, ఆ తర్వాత నుంచి భారీ సుంకాలు అమల్లోకి వస్తాయ ని చెప్పారు. అలాగే హరిత హైడ్రోజన్ తయారీలో దేశీ పరిశ్రమ తగు రీతిలో పోటీపడే స్థాయికి ఎదిగే వరకూ తొలుత కొన్నేళ్ల పాటు పీఎల్ఐ స్కీము అందుబాటులో ఉంటుందని సింగ్ వివరించారు. దాదాపు రూ. 19,744 కోట్ల జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిషన్ కింద వచ్చే అయిదేళ్లలో 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. -
5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూలమైన హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని 2030 నాటికి 5 మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఉపయోగించే పునరుత్పాదక విద్యుత్ పంపిణీపై పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు లభించనుంది. జాతీయ హైడ్రోజన్ విధానం తొలి భాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. కొత్త విధానాన్ని వివరించేందుకు త్వరలో పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. హరిత హైడ్రోజన్, అమోనియాల వినియోగం పెరిగితే పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చమురు రిఫైనరీలు మొదలు, ఉక్కు ప్లాంట్ల వరకూ చాలా సంస్థలకు హైడ్రోజన్ అవసరమవుతుంది. ప్రస్తుతం సహజ వాయువు లేదా నాఫ్తా వంటి శిలాజ ఇంధనాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు వెలువడి కాలుష్య కారకంగా మారుతున్నందున పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా విధానాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రెండో విడతలో దశలవారీగా ప్లాంట్లు హరిత హైడ్రోజన్, హరిత అమోనియా వినియోగించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా ప్లాంటు..: కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను కంపెనీలు దేశంలో ఎక్కడైనా సొంతంగానైనా లేదా డెవలపర్ ద్వారానైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్సే్చంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ విద్యుత్‌ను హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్లాంటు వరకు ట్రాన్స్మిషన్ గ్రిడ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయవచ్చు. ఇందుకోసం పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. 2025 జూన్ 30 లోగా ఏర్పాటైన ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. అలాగే వినియోగించుకోని పునరుత్పాదక విద్యుత్‌ను గ్రీన్ హైడ్రోజన్, అమోనియా తయారీదారులు.. 30 రోజుల పాటు పంపిణీ సంస్థ వద్దే అట్టే పెట్టుకుని, అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు. -
'2018 చివరి నాటికి నిరంతర విద్యుత్'
నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అపోహలకు తావులేదని ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్గొండలో విలేకర్లతో మాట్లాడుతూ... కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ప్రాజెక్టులను గడువులోపు పూర్తి చేస్తామని చెప్పారు. 2018 చివరినాటికి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు.