న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి తన మొత్తం విద్యుదుత్పత్తిలో 65 శాతాన్ని శిలాజేతర ఇంధనాల నుంచే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 90 గిగావాట్ల సోలార్ ఎక్విప్‌మెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ప్రస్తుతం ఈ సామర్థ్యం 20 గిగావాట్లుగా ఉన్నట్టు చెప్పారు.
15–20 గిగావాట్ల సోలార్ ఎక్విప్‌మెంట్ తయారీ సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు తెలిపారు. పీఎల్‌ఐ పథకం కింద మరో 40 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. అధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఎక్విప్‌మెంట్ తయారీకి మళ్లాలని పరిశ్రమకు సూచించారు. మన దేశంలో ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 170 గిగా వాట్లకు చేరుకుందని, మరో 80 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు చెప్పారు.
‘‘2030 నాటికి 50 శాతం పర్యావరణ అనుకూల ఇంధన విద్యుత్ సాధిస్తామని హామీ ఇచ్చాం. కానీ, దానికంటే ఎక్కువే సాధిస్తాం. 2030 నాటికి 65 శాతం కంటే ఎక్కువ సామర్థ్యం పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచి ఉంటుంది. 2030 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను 33 శాతం తగ్గిస్తామని చెప్పాం. ఇప్పటికే 30 శాతం తగ్గించే స్థాయికి చేరుకున్నాం. కనుక 2030 నాటికి 45 శాతం తగ్గింపు లక్ష్యాన్ని సాధిస్తాం’’అని మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment