ప్లాంట్ నిర్మాణ వివరాలు తెలుసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
కర్నూలు(రాజ్‌విహార్): భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని గుమ్మితంతండా వద్ద ఏర్పాటుచేస్తున్న 5,230 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును ఆయన సోమవారం పరిశీలించారు. సజ్జల మాట్లాడుతూ ఒకే యూనిట్ నుంచి సోలార్(సూర్యరశ్మి), విండ్(గాలి మరల ద్వారా), హైడల్(నీటి) ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని అన్నారు.
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3 వేల మెగా వాట్లు, విండ్ పవర్ 550 మెగా వాట్లు, హైడల్ పవర్ 1,680 మెగా వాట్లు, మొత్తం 5,230 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేసి, నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు.
ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 23వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించిందని, ఇందులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని గ్రీన్‌కో ప్రతినిధులతో అన్నారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment