సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బొగ్గు కొరత రాకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని, థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. బొగ్గు కొరతను అధిగమించడానికి సులియారీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి పెంచడంతో పాటు సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యంతోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు కలిసి రావడంతో పాటు, ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుందని అన్నారు.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని వారికి వివరించాలని సూచించారు. డిసెంబర్‌లోగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల టెండర్లు పూర్తి కావాలని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్ కొనుగోలు చేశామని ఇంధన శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ (పీహెచ్‌ఎస్‌పీపీ)పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం
అన్ని రకాలుగా ప్రయత్నం..
► కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి.
► కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండటం వల్ల ఓడల ద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలి. సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి. కోల్ స్వాపింగ్ (ఇచ్చిపుచ్చుకోవడం) లాంటి వినూత్న ఆలోచనలు అమలు చేయాలి.
► విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చు. డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి.
మీటర్ల ఏర్పాటుపై రైతులకు లేఖలు
► వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇందు కోసం రైతులకు లేఖలు రాయాలి. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో, దానివల్ల రైతులకు జరిగిన మేలేంటో కూడా వివరించాలి. అక్కడ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిన విషయాన్ని రైతులకు తెలియాజేయాలి.
► మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని, విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటుందనే విషయాలపై రైతుల్లో అవగాహన కల్పించాలి. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్ పాడైనా వెంటనే రీప్లేస్ చేయాలి.
► ఈ సమావేశంలో ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్‌కాప్ ఎండీ ఎస్ రమణారెడ్డి, డిస్కంల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మా జనార్ధనరెడ్డి పాల్గొన్నారు.
డిసెంబర్‌లోగా టెండర్లు
► పోలవరం విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ పనులపైనా సీఎం సమీక్షించారు. పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని 2024 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా చేశామని అధికారులు తెలిపారు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంపులకు కరెంటు ఇస్తామన్నారు.
► ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్‌లోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు(పీఎస్‌పీ)లపై సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. జగనన్న కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు.
► కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ యూనిట్–3 సెప్టెంబర్ నుంచి, విజయవాడ థర్మల్ ప్లాంట్ ఐదవ స్టేజ్ 2023 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు. ఈ రెండు యూనిట్ల ద్వారా అదనంగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment