సాక్షి, అమరావతి: పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాన్ని సరకు రవాణాకు (లాజిస్టిక్‌కు) కేంద్ర బిందువుగా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంకల్పం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పోర్టులను అనుసంధానిస్తూ నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఆరు రహదారులకు కేంద్రం ఆమోదం తెలపగా, తాజాగా కృష్ణపట్నం పోర్టును అనుసంధానిస్తూ రెండు జాతీయ రహదారులకు ఆమోదం లభించింది. రూ. 2,308.31 కోట్ల అంచనాతో వీటి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదించింది.
తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి తూర్పు కానుపూరు వరకు ఆరు లేన్ల రహదారి నిర్మిస్తారు. తద్వారా కృష్ణపట్నం పోర్టును నాయుడుపేటతో అనుసంధానిస్తారు. మొత్తం 34.88 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ.1,398.84 కోట్లు ఖర్చవుతుంది. ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ రహదారి. రెండోది ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలోని చిలకూరు క్రాస్ నుంచి తూర్పు కానుపూరు వరకు నిర్మిస్తారు. ఇది నాలుగు లేన్ల రహదారి. కృష్ణపట్నం పోర్టు దక్షిణ గేటు నుంచి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ నిర్మించే ఈ మార్గం గ్రామాల వద్ద ఫ్లై ఓవర్లు, అప్రోచ్ రోడ్లతో సహా మొత్తం 36.05 కి.మీ. ఉంటుంది. రూ.909.47 కోట్లతో దీనిని నిర్మిస్తారు. వీటికి త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. 2024 జనవరి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
13 రహదారులకు ప్రతిపాదన
ఆగ్నేయాసియా దేశాలతో సరకు రవాణాకు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఈ మూడు పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ 277 కిలోమీటర్ల మేర 13 రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపింది. సీఎం వైఎస్ జగన్ 2019లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించారు. వాటిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం మూడు పోర్టుల అనుసంధానానికి 8 రహదారులకు ఆమోదం తెలిపింది.
పారిశ్రామికాభివృద్ధికి ఊతం
ఈ రెండు రహదారులతో కృష్ణపట్నం పోర్టు నుంచి వాహనాలు చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారికి సులువుగా చేరుకోవచ్చు. దాంతో పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు మరింత వేగం పుంజుకుంటాయి. ప్రధానంగా ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన గ్రేటర్ రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. ఇప్పటికే ఎస్పీఆర్‌ఎస్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఎస్‌ఈజెడ్‌లలో తయారీ పరిశ్రమలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పరిశ్రమల నుంచి సరకు రవాణాకు ఈ రహదారులు మరింతగా తోడ్పడతాయి. మరోవైపు కృష్ణపట్నం పోర్టు ద్వారా తూర్పు కర్ణాటక ప్రాంతానికి సరకు రవాణా మరింతగా పెరుగుతుంది. దాంతో రాయలసీమ లాజిస్టిక్ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక వేగంగా సరకు రవాణా
Published Wed, Aug 10 2022 4:17 AM | Last Updated on Wed, Aug 10 2022 4:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment