మహిళలకు ‘అభయం’ | CM YS Jagan To Launch Abhayam Project For Womens Safety In AP | Sakshi
Sakshi News home page

మహిళలకు ‘అభయం’

Published Mon, Nov 23 2020 3:18 AM | Last Updated on Mon, Nov 23 2020 3:18 AM

CM YS Jagan To Launch Abhayam Project For Womens Safety In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘అభయం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని వెంటనే పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇది. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును నేడు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. దీన్లో 58.64 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి టెండర్లను పరిశీలించింది. గతేడాది ‘యష్‌’ టెక్నాలజీస్‌ ఈ టెండరును దక్కించుకుంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్‌ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. 

‘అభయం’ అమలు ఇలా..
– రవాణా వాహనాల్లో ట్రాకింగ్‌ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు.
– రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చాలి.
– తొలుత వెయ్యి ఆటోల్లో సోమవారం ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది.
– ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్‌లో ‘అభయం’ మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వాహనంఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.
– స్కాన్‌ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి.
– స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది.
– స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్‌ బటన్‌ నొక్కితే సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటరుకు చేరుతుంది. క్యాబ్‌/ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్‌ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు. 
– ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు ఇస్తారు.
– ఆటోలు స్టార్ట్‌ చేసేటప్పుడు ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్‌ చేస్తేనే స్టార్ట్‌ అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement