Tracking device
-
దీన్ని తగిలిస్తే సరి! ఎక్కడున్నా ఇట్టే దొరికిపోతుంది!!
చాలా మంది కొన్ని సార్లు వస్తువులు ఎక్కడో పెట్టి మరిచిపోతుంటారు. అవసరానికి ఆ వస్తువు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా జియోట్యాగ్ ఎయిర్ పేరుతో కొత్త ట్రాకింగ్ డివైజ్ ను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన జియోట్యాగ్ కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైజ్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.జియోథింగ్స్ యాప్‌తో మాత్రమే పని చేసే జియోట్యాగ్ మాదిరిగా కాకుండా, జియోట్యాగ్ ఎయిర్ యాపిల్ ఫైండ్ మై ఫీచర్‌కూ అనుకూలంగా ఉంటుంది. ఇది తాళం చెవిలు, ఐడీ కార్డులు, వాలెట్లు, పర్సులు, లగేజీలు ఇలా ఏ వస్తువుకైనా దీన్ని తగిలించవచ్చు. పెంపుడు జంతువుల మెడలోనూ వేయొచ్చు. ఇవి కనిపించకుండా పోయినప్పుడు ఈ గ్యాడ్జెట్ సాయంతో ట్రాక్ చేయొచ్చు.ఇది ఐఓఎస్ 14 ఆపైన వెర్షన్ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ 9 ఆపైన వెర్షన్ ఆండ్రాయిడ్ డివైజ్ లలో పనిచేస్తుంది. వైర్ లెస్ డివైజ్ ట్రాకింగ్ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3ను ఇందులో అందించారు. 90-120 డెసిబుల్స్ శబ్దం చేసే ఇన్‌బిల్ట్ స్పీకర్ ఇందులో ఉంది. జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. రూ.2,999 ధరతో లిస్ట్ అయిన జియోట్యాగ్ ఎయిర్‌ను ప్రారంభ ఆఫర్ కింద రూ.1,499కే లభిస్తుంది. బ్లూ, రెడ్, గ్రే కలర్ వేరియంట్లు ఉన్నాయి. పేటీఎం, క్రెడ్ యూపీఐ, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. -
యాపిల్ స్పెషల్ ఫీచర్‌తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్, ఐపాడ్స్, స్మార్ట్ వాచెస్‌ను చూశాం. తాజాగా టెంపరేచర్‌ను కంట్రోల్ చేసే కీలక ఫీచర్‌తో యాంబర్ ట్రావెల్మగ్ 2+ను యాపిల్ తన ఆన్లైన్ స్టోర్‌లో విక్రయిస్తోంది. యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ ధర ప్రస్తుతం 199.95 డాలర్లు (రూ. 16,542) గా ఉంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌లో ఫైండ్ మై యాప్‌కు సపోర్ట్‌ను అందిస్తోంది అంటే ఒక వేళ ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ పోతే, దాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) వేడిగా వేడిగా కాఫీనో, టీనో ఆస్వాదించే ఈ యాంబర్ ట్రావెల్ మగ్ 2+ లో మనం తాగే డ్రింక్ ఉష్ణోగ్రతను (120°F- 145°F) సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ బ్యాటరీ సాయంతో ఉష్ణోగ్రతను 3 గంటల వరకు ఉంచుకోవచ్చు. లేదా ఛార్జింగ్ కోస్టర్ సాయంతో రోజంతా కూడా ఇందులోని డ్రింక్స్‌ను హాట్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి టెక్ వార్తలు, ఇతర బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం
న్యూఢిల్లీ: పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసేందుకు, ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే విధానాన్ని (సీఈఐఆర్) కేంద్రం ఈ వారంలో ఆవిష్కరించనుంది. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడాట్) రూపొందించిన ఈ సిస్టం ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలతో పాటు కొన్ని టెలికం సర్కిల్స్ లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీన్ని తాజా గా మే 17న దేశవ్యాప్తంగా అమల్లోకి తేనున్నట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అయి తే, ఇథమిత్థంగా తేదీని చెప్పనప్పటికీ ఈ త్రైమాసికంలో సీఈఐఆర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సీడాట్ సీఈవో రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు మొబైల్ ఫోన్ల దొంగతనాల ఉదంతాలు తగ్గుముఖం పట్టేందుకు, చోరీకి గురైన..పోయిన మొబైల్ ఫోన్ల జాడలు కనుగొనడంలో పోలీసులకు సహాయకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. అలాగే, మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు వాడే ఐఎంఈఐ నంబర్ల క్లోనింగ్‌ను అరికట్టడంతో పాటు దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహాయపడగలదని వివరించారు. సీఈఐఆర్ విధానాన్ని ఉపయోగించి ఇటీవలే కర్ణాటక పోలీసులు 2,500 పైచిలుకు ఫోన్లను రికవర్ చేసి, యజమానులకు అప్పగించారు. పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు యాపిల్ ఫోన్లలో ఇప్పటికే ప్రత్యేక సిస్టం ఉండగా.. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో మాత్రం లేదు. మొబైల్ నంబరుకు అనుసంధానమైన డివైజ్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఫోన్‌ను కనిపెట్టేందుకు సీఈఐఆర్ తోడ్పడుతుంది. -
సముద్ర జలాల్లో రూ.3,700 కోట్ల కొకైన్ పట్టివేత
రోమ్: ఇటలీలోని సిసిలీకి సమీపంలోని సముద్ర జలాల్లో తేలియాడుతున్న కొకైన్ ప్యాకెట్లివి. సుమారు రెండు టన్నుల బరువున్న 70 బండిళ్లలో 1,600 ప్యాకెట్లలోని ఈ కొకైన్ విలువ ఏకంగా రూ.3,700 కోట్లు! స్మగ్లర్లు వీటిని బహుశా నౌకలో తెచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నీటిపై తేలియాడుతున్న వీటి జాడ తెలుసుకునేందుకు వీలుగా ప్యాకెట్లకు ట్రాకింగ్ డివైజ్‌ను కూడా అమర్చారని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా పెట్రోలింగ్ చేస్తుండగా ఇవి కనిపించాయి. -
ప్రమాదకర వస్తు రవాణాకు ట్రాకింగ్ ఉండాల్సిందే
న్యూఢిల్లీ: ప్రమాదకరమైన సరుకులను, ముడిపదార్థాలను రవాణా చేసే వాహనాలు లొకేషన్ ట్రాకింగ్ పరికరాలను అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది తప్పనిసరిగా అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ పర్మిట్ (అనుమతులు) పరిధిలోకి రాని వాహనాలు ప్రమాదకర వాయువులు, వస్తువులను రవాణా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. 2022 సెప్టెంబర్ 1 తర్వాత కేటగిరీ ఎన్2, ఎన్3 వాహనాలకు తయారీ దశలోనే పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. -
అబలకు అభయం
సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మల ఆర్థిక, రాజకీయ స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ, భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మహిళల అభ్యున్నతికి సువర్ణాక్షరాలతో లిఖించదగే కార్యక్రమాలను గత 17 నెలల కాలంలో చేపట్టామన్నారు. ఆటోలు, ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘అభయం ప్రాజెక్టు’ (యాప్)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తొలుత విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా 1,000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి దీన్ని అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి విజయవాడ, తిరుపతిలో కూడా అమలులోకి తెచ్చి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్‌లు అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘అభయం’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి సుచరిత, అధికారులు నిస్సందేహంగా మహిళా పక్షపాత ప్రభుత్వం.. ‘‘రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు అండగా మన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేసింది. నిస్సందేహంగా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునేలా పనిచేస్తున్నాం. అమ్మ ఒడి పథకం, ఆసరా, చేయూత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో సాయాన్ని జమ చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన చేకూర్చి చరిత్రలో నిలిచే ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సగం మహిళలకు కేటాయిస్తూ చట్టాలు.. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చేలా ఏకంగా చట్టాలు చేసిన ప్రభుత్వం మనది. రాజకీయంగా అక్క చెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాం. హోంమంత్రిగా నా చెల్లెమ్మ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా మరొక చెల్లెమ్మ ఉండడం మహిళల రాజకీయ సాధికారతకు నిదర్శనం. ఆ మాటలను మరువలేదు.. రక్షణ, భద్రత విషయంలో రాజీ పడొద్దు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలతో నా మొట్టమొదటి కాన్ఫరెన్సులో చెప్పిన మాటలు గుర్తున్నాయి. దేశంలో తొలిసారిగా దిశ బిల్లు ప్రవేశపెట్టి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ఈరోజు ప్రతి జిల్లాలో దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్లు కనిపిస్తున్నాయి. దిశ కోర్టుల్లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉండే విధంగా ప్రభుత్వం నామినేట్ చేసింది. దిశ యాప్ బటన్ నొక్కిన 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విధంగా చర్యలు తీసుకున్నాం. సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించాం. మహిళా పోలీసు మిత్రలను కూడా తయారు చేస్తున్నాం. మరో అడుగు ముందుకు.. ఇవాళ మహిళల కోసం ‘అభయం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ఒక యాప్ లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ప్రాజెక్టు అనుకోవచ్చు. దిశ యాప్‌ను పోలీసు శాఖ నిర్వహిస్తుండగా అభయం యాప్ (ప్రాజెక్టు) రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అక్క చెల్లెమ్మలు, చిన్నారులు ఆటోలు, టాక్సీలలో నిర్భయంగా ప్రయాణించేందుకు, ప్రయాణ సమయంలో ఏ ఆపద రాకుండా చూసేలా అభయం ఐవోటీ ఉపకరణాన్ని ఆటో, టాక్సీల్లో అమరుస్తాం. ఆటోలు, టాక్సీలు నడిపే సోదరుల మీద నమ్మకం లేక ఇదంతా చేయడం లేదు. వారిపై ప్రయాణికులకు మరింత నమ్మకం కల్పించి నిశ్చింతంగా ఉండేందుకే ఈ ఏర్పాటు. ఏమిటీ ‘అభయం’?.. ఆటోలు, టాక్సీల్లో ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఉపకరణాన్ని అమరుస్తారు. ఆటో / టాక్సీ ఎక్కిన వెంటనే అక్క చెల్లెమ్మలు స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వెంటనే పూర్తి వివరాలు నమోదవుతాయి. ఏదైనా ఆపద సమయంలో వారివద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే రెడ్ బటన్ నొక్కితే పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని ఆదుకుంటారు. క్యాబ్‌లకు ధీటుగా భద్రత... వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నాటికి 5 వేల వాహనాల్లో, జూలై 1 నాటికి 50 వేల వాహనాల్లో, నవంబరు నాటికి లక్ష వాహనాల్లో అభయం ఐవోటీ ఉపకరణాలను ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉబెర్, ఓలా లాంటి బహుళ జాతి సంస్థల క్యాబ్‌లకు ధీటుగా ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారనే విశ్వాసం కలుగుతుంది. ఇలా అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నా’’ సోదరుడిలా అండగా సీఎం – మేకతోటి సుచరిత, హోంమంత్రి ‘మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలలు, మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో చర్యలు చేపట్టారు. దిశ చట్టం, సైబర్ మిత్ర, మహిళా మిత్రల ద్వారా భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు అభయం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్ అంటే మహిళలకు ఒక అభయ హస్తం మాదిరిగా, ఒక సోదరుడిలా అండగా నిలిచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ ఎర్ర బటన్ నొక్కగానే ఇంధనం బంద్ అభయం ఐఓటీ ఉపకరణంలో రెడ్ బటన్ నొక్కగానే అలారమ్ మోగడంతోపాటు వాహనానికి ఇంధన సరఫరా నిల్చిపోతుందని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వివరించారు. అభయం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు, పోలీసు, రవాణా శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొనగా జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. భద్రతపై నిశ్చింత.. అభయం పానిక్ బటన్‌పై మా కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇది చూసిన తర్వాత మాకు భద్రత ఉంటుందనే నమ్మకం కలిగింది. యాప్‌ను ఇప్పటికే సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నాం. – గమ్య, డిగ్రీ విద్యార్థిని, విశాఖపట్నం అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నుంచి అభయం ప్రాజెక్టు మొదలైంది. ఆర్నెల్లుగా పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశాం. దీనిద్వారా మహిళలు, బాలికలకు మరింత భద్రత ఉంటుంది. అభయం డివైజ్‌ను ఎవరైనా డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేస్తాం’ – జీసీ రాజారత్నం, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విశాఖపట్నం -
మహిళలకు ‘అభయం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘అభయం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని వెంటనే పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇది. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును నేడు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. దీన్లో 58.64 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి టెండర్లను పరిశీలించింది. గతేడాది ‘యష్’ టెక్నాలజీస్ ఈ టెండరును దక్కించుకుంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. ‘అభయం’ అమలు ఇలా.. – రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. – రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చాలి. – తొలుత వెయ్యి ఆటోల్లో సోమవారం ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది. – ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్లో ‘అభయం’ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాహనంఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. – స్కాన్ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. – స్మార్ట్ ఫోన్ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. – స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కితే సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటరుకు చేరుతుంది. క్యాబ్/ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు. – ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. – ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. -
‘బెంజ్’ కార్లలో నిఘా నేత్రం
జర్మనీకి చెందిన ఖరీదైన కార్ల కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ కార్లలో వినియోగదారులకు తెలియని ఓ రహస్య ఫీచర్ ఉన్నట్లు మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చింది. అదే నిఘా నేత్రం. దాన్నే ట్రాకింగ్ డివైస్ అని, లొకేషన్ సెన్సర్ అని కూడా పిలుస్తారు. ఈ నిఘా నేత్రం ఫీచర్ ద్వారా ఆ కారు ఎక్కడ, ఎప్పుడుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ విషయం తెల్సిన వినియోగదారులు తమ ‘గోప్యత’ గుట్టు రట్టవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లలో కులాసాగా తిరిగే విలాస కుర్రవాళ్లయితే లబోదిబోమంటున్నారు. 1,70,000 మెర్సిడెస్ బెంజ్ కార్లను గతేడాది ఒక్క బ్రిటన్‌లోనే అమ్మామని, వాటన్నింటిలోనూ ఈ నిఘా నేత్రం ఉందని కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. తాము ఎలాంటి దురుద్దేశంతోని ఈ లొకేషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేయలేదని, అత్యవసర సమయాల్లోనే ఈ సెన్సర్ ఉపయోగాన్ని వాడుకుంటామని యాజమాన్యం పేర్కొంది. థర్ట్ పార్టీ ఆర్థిక సహాయంతో ఈ కారును కొన్నవాళ్లు ఆ పార్టీని మోసం చేసిన పక్షంలో కారు ఎక్కడుందో, ఎక్కడి నుంచి కారును స్వాధీనం చేసుకోవచ్చో తెలియజేయడం కోసం ఈ ఏర్పాటు చేశామని, వారికి యజమాని వివరాలతోపాటు కారున్న చోటుకు సంబంధించిన సమాచారం ఇస్తామని యాజమాన్యం వివరించింది. కొత్త కార్లతోపాటు వాడిన కార్లలో కూడా ఈ సెన్సర్‌ను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. అయితే ఐరోపా డేటా రక్షణ చట్టం నిబంధనల ప్రకారం కార్లలో ఇలాంటి ‘నిఘా నేత్రా’లను ఏర్పాటు చేయకూడదు. తాము కార్లను అమ్మేటప్పుడే వినియోగదారుల నుంచి లొకేషన్ సెన్సర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకుంటున్నామని కూడా యాజమాన్యం తెలియజేసింది. కార్లను కొనేటప్పుడు, ముఖ్యంగా ఫైనాన్స్‌లో కొనేటప్పుడు అనేక కాగితాల మీద సంతకాలు తీసుకుంటారని, అలాంటప్పుడు ఈ నిబంధన దేనికో ఎవరు క్షుణ్నంగా చదవి సంతకాలు చేస్తారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తమ కార్ల అమ్మకాల్లో 80 శాతం అమ్మకాలు థర్డ్ పార్టీ ఫైనాన్స్‌తోని జరగుతాయని, అందుకని ఈ ఫీచర్ తప్పనిసరి అయిందని కూడా యాజమాన్యం వాదిస్తోంది. అయితే ఈ సెన్సర్లపై దర్యాప్తు జరపాల్సిందిగా లండన్ మాజీ రక్షణ మంత్రి డేవిడ్ డేవిస్ ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ ఇలా ‘బిగ్ బ్రదర్’లా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని, ఈ కంపెనీ మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. అయితే తాను సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇలా మూడో పార్టీకి అందించడం చట్టపరంగా ఎంతమేరకు సమంజసమో కూడా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. తమ కార్లలో మాత్రం ఇలాంటి నిఘా నేత్రం లేదని బీఎండబ్లూ, జాగ్వర్ ల్యాండ్ రోవర్, వోక్స్వాగన్ కార్ల కంపెనీలు స్పష్టం చేశాయి. ఇలాంటి ఫీచర్ అవసరమైతే ఎక్కువగా చోరీలకు గురవుతున్న ఫోర్డ్ కంపెనీలకు ఉండాలిగానీ మెర్సిడెస్ బెంచీలకు ఎందుకని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఈ ఒక్క సంవత్సరమే 1557 ఫోర్డ్ కారులు చోరీకి గురయ్యాయి. -
కాల్‌సెంటర్ క్యాబ్‌లలో జీపీఎస్ వ్యవస్థ
సాక్షి, ముంబై: కాల్‌సెంటర్ ఉద్యోగులను తరలించే అన్ని వాహనాలలో ఠాణే ట్రాఫిక్ పోలీసులు ట్రాకింగ్ పరికరాన్ని అమర్చనున్నారు. ఈ పరికరాన్ని అమర్చిన వాహనాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోడ్బందర్ రోడ్ వద్ద సోమవారం ప్రారంభించనున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ‘సురక్షితంగా ప్రయాణించు’ అన్న నినాదంతో ఠాణే ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కాల్‌సెంటర్ క్యాబ్‌లలో జీపీఎస్ వ్యవస్థను అమర్చడం ద్వారా అందులే ప్రయాణించే మహిళలు వాహనం ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానం చేరే వరకు ఈ వ్యవస్థ ట్రాకింగ్ చేస్తుంది. ఈ వ్యవస్థ మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులకు ఎంతో సహాయకరంగా ఉంటుందని ఠాణే ట్రాఫిక్ డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ కరాండీకర్ అన్నారు. కాల్ సెంటర్ ఉద్యోగులను తరలించే అన్ని వాహనాలలో ఈ పరికరాన్ని అమర్చుతామన్నారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులకు ఓ చిప్‌ను అందజేస్తారు. ఆ చిప్‌లో సదరు ప్రయాణికురాలి వివరాలు, ఆమె ఐదుగురి బంధువుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాహనంలో ప్రయాణం చేసే సమయంలో సదరు మహిళా ప్రయాణికురాలు ఆ చిప్‌ను పరికరంలో ఉంచాలి. దీంతో కుటుంటు సభ్యులు ఆమె ఎక్కడ ఉందన్న సమాచారం తెలుసుకోవచ్చు.