‘బెంజ్‌’ కార్లలో నిఘా నేత్రం | The SPY In The Every Mercedes Benz | Sakshi
Sakshi News home page

‘బెంజ్‌’ కార్లలో నిఘా నేత్రం

Aug 20 2019 7:28 PM | Updated on Aug 20 2019 7:31 PM

The SPY In The Every Mercedes Benz - Sakshi

జర్మనీకి చెందిన ఖరీదైన కార్ల కంపెనీ ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ కార్లలో వినియోగదారులకు తెలియని ఓ రహస్య ఫీచర్‌ ఉన్నట్లు మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చింది. అదే నిఘా నేత్రం. దాన్నే ట్రాకింగ్‌ డివైస్‌ అని, లొకేషన్‌ సెన్సర్‌ అని కూడా పిలుస్తారు. ఈ నిఘా నేత్రం ఫీచర్‌ ద్వారా ఆ కారు ఎక్కడ, ఎప్పుడుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ విషయం తెల్సిన వినియోగదారులు తమ ‘గోప్యత’ గుట్టు రట్టవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లలో కులాసాగా తిరిగే విలాస కుర్రవాళ్లయితే లబోదిబోమంటున్నారు. 

1,70,000 మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను గతేడాది ఒక్క బ్రిటన్‌లోనే అమ్మామని, వాటన్నింటిలోనూ ఈ నిఘా నేత్రం ఉందని కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. తాము ఎలాంటి దురుద్దేశంతోని ఈ లొకేషన్‌ సెన్సర్‌ను ఏర్పాటు చేయలేదని, అత్యవసర సమయాల్లోనే ఈ సెన్సర్‌ ఉపయోగాన్ని వాడుకుంటామని యాజమాన్యం పేర్కొంది. థర్ట్‌ పార్టీ ఆర్థిక సహాయంతో ఈ కారును కొన్నవాళ్లు ఆ పార్టీని మోసం చేసిన పక్షంలో కారు ఎక్కడుందో, ఎక్కడి నుంచి కారును స్వాధీనం చేసుకోవచ్చో తెలియజేయడం కోసం ఈ  ఏర్పాటు చేశామని, వారికి యజమాని వివరాలతోపాటు కారున్న చోటుకు సంబంధించిన సమాచారం ఇస్తామని యాజమాన్యం వివరించింది. కొత్త కార్లతోపాటు వాడిన కార్లలో కూడా ఈ సెన్సర్‌ను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. 

అయితే ఐరోపా డేటా రక్షణ చట్టం నిబంధనల ప్రకారం కార్లలో ఇలాంటి ‘నిఘా నేత్రా’లను ఏర్పాటు చేయకూడదు. తాము కార్లను అమ్మేటప్పుడే వినియోగదారుల నుంచి లొకేషన్‌ సెన్సర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకుంటున్నామని కూడా యాజమాన్యం తెలియజేసింది. కార్లను కొనేటప్పుడు, ముఖ్యంగా ఫైనాన్స్‌లో కొనేటప్పుడు అనేక కాగితాల మీద సంతకాలు తీసుకుంటారని, అలాంటప్పుడు ఈ నిబంధన దేనికో ఎవరు క్షుణ్నంగా చదవి సంతకాలు చేస్తారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తమ కార్ల అమ్మకాల్లో 80 శాతం అమ్మకాలు థర్డ్‌ పార్టీ ఫైనాన్స్‌తోని జరగుతాయని, అందుకని ఈ ఫీచర్‌ తప్పనిసరి అయిందని కూడా యాజమాన్యం వాదిస్తోంది. 
అయితే ఈ సెన్సర్లపై దర్యాప్తు జరపాల్సిందిగా లండన్‌ మాజీ రక్షణ మంత్రి డేవిడ్‌ డేవిస్‌ ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఈ కంపెనీ ఇలా ‘బిగ్‌ బ్రదర్‌’లా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని, ఈ కంపెనీ మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. అయితే తాను సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇలా మూడో పార్టీకి అందించడం చట్టపరంగా ఎంతమేరకు సమంజసమో కూడా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. తమ కార్లలో మాత్రం ఇలాంటి నిఘా నేత్రం లేదని బీఎండబ్లూ, జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్, వోక్స్‌వాగన్‌ కార్ల కంపెనీలు స్పష్టం చేశాయి. ఇలాంటి ఫీచర్‌ అవసరమైతే ఎక్కువగా చోరీలకు గురవుతున్న ఫోర్డ్‌ కంపెనీలకు ఉండాలిగానీ మెర్సిడెస్‌ బెంచీలకు ఎందుకని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఈ ఒక్క సంవత్సరమే 1557 ఫోర్డ్‌ కారులు చోరీకి గురయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement