200 Units Of Free Electricity For SCs And STs Andhra Pradesh - Sakshi
Sakshi News home page

Fact Check: అర్హులెవరికీ ఆగలేదు.. వాస్తవాలు దాచి పచ్చ పత్రిక మరో ఏడుపుగొట్టు కథనం

Dec 22 2022 4:27 AM | Updated on Dec 22 2022 2:58 PM

200 units of free electricity for SCs and STs Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏడుపుగొట్టు వాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. ఏ కారణం లేకపోయినా, ఏదో ఒకటి చెప్పి ఏడుస్తుంటాడు. తన మెదడులో మెదిలింది బయటకు వెళ్లగక్కి మరీ ఏడుస్తాడు. అందులో నిజం లేదన్న విషయం పట్టదు. ఇందుకు ప్రతీకలే పచ్చ పత్రికలు. విషతుల్యమైన వాటి మెదడు విషమే కక్కుతుంది. అబద్ధాలు వండి వారిస్తుంది. ఇటువంటి మరో కథనమే ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్తుపై అవాస్తవ కథనాలు. వాస్తవాలు మాత్రం వేరు.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడానికి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. కేవలం మాటిచ్చి ఊరుకోవడం అలవాటు లేని సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అమలు చేయడానికి 2019 జూలై 25న ప్రభుత్వం జీవో నంబర్‌ 91 జారీ చేసింది.

ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొంది. దీనికి అనుగుణంగానే విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆ కాలనీల్లో అర్హులైన  అందరికీ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. దీంతో ఆయా వర్గాల ప్రజలు సీఎం జగన్‌కు గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు. తమ ఇంట విద్యుత్‌ కాంతులు నింపిన దేవుడని చేయెత్తి మొక్కుతున్నారు.

ఇదంతా చూసి పచ్చపత్రిక తట్టుకోలేకపోతోంది. ఓ అబద్ధాన్ని బలవంతంగా ప్రజల మెదళ్లలోకి చొప్పించాలని కుట్రలు పన్నుతోంది. అనర్హులను తొలగిస్తే ’ఎస్సీ, ఎస్టీలకు షాక్‌’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆ తప్పుడు కథనాన్ని ఇంధన శాఖ ఖండించింది. అసలు నిజాలను వెల్లడించింది.  

ఆరోపణ: ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం లబ్ధిదారుల సంఖ్యలో ప్రభుత్వం కోత పెట్టింది.

వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్‌ పథకంలో ఇచ్చింది నెలకు 100 యూనిట్లు కాగా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 200 యూనిట్లకు పెంచింది. ఇలా పెంచడం వలన ఏర్పడ్డ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్‌ పొందడానికి ఈ ఏడాది నవంబర్‌ వరకు 22.56 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు అర్హత పొందారు. గత ప్రభుత్వం ఈ పథకానికి 2018–19 లో సుమారు రూ. 230 కోట్లు ఖర్చు పెట్టగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2021–22లో రూ.700 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.450 కోట్లు వెచ్చించింది.

ఆరోపణ: సర్వేలో డొల్లతనం వల్ల ఉచిత విద్యుత్‌ జాబితా నుంచి అర్హుల కనెక్షన్లు తొలగించారు

వాస్తవం: ఇది కూడా అబద్ధమే. ఉచిత విద్యుత్‌ పథకానికి 200 యూనిట్లకు మించి వినియోగించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఆధార్‌ అనుసంధానం చేసినప్పుడు కుల ధ్రువీకరణ బీసీ, ఓసీగా నమోదైన వారిని మాత్రమే అనర్హులుగా నిర్ధారించారు. అర్హుల సర్వీసులేవీ తొలగించలేదు. ఒకవేళ అర్హత ఉండి ఈ పథకం రాకపోతే ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో విద్యుత్‌ అధికారులను, గ్రామ సచివాలయ అధికారులను సంప్రదించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు కోరుతున్నాయి.

అనర్హులకూ ఇమ్మంటారా
అర్హులైన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీల్లోని నిరు పేదలకు అందాల్సిన ఈ పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని డిస్కంలు వెల్లడించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు  చేస్తూ, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు సైతం భార్య, ఇతరుల పేరు మీద ఉచిత విద్యుత్‌ సర్వీసులు తీసుకున్నట్లు తెలిపాయి.

ఇలాంటి వారిని గుర్తించి అనర్హుల జాబితాలో చేరుస్తున్నట్లు తెలిపాయి.  విద్యుత్‌ వృథాను, అక్రమ కనెక్షన్లను తగ్గించడం ద్వారా వాస్తవ అర్హులకు లబ్ధి చేకూర్చాలనేది తమ ధ్యేయమని, అర్హులెవరూ ఆందోళన చెందవద్దని డిస్కంలు చెబుతున్నాయి. ఎస్సీ ఎస్టీ విద్యుత్‌ కనెక్షన్‌తో ఆధార్‌ నంబరు అనుసంధానం చేయడం ద్వారా రెండో కనెక్షన్‌కు ఉచిత విద్యుత్‌ పథకం అమలు కాకుండా నియంత్రణ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని  డిస్కంలు ఖండించాయి. అది వాస్తవం కాదని, పచ్చ పత్రిక రాతలు అనర్హులకు కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటున్నట్టుగా ఉన్నాయని డిస్కంలు మండిపడ్డాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement