
న్యూఢిల్లీ: అనియంత్రిత రంగ సంస్థలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో సత్వరం జోక్యం చేసుకుని పరిష్కారమార్గం చూపాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్ఛేంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి.
తయారీ, క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు మొదలైన వాటికి సంబంధించిన 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. సీపీపీలు నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు వాటిపై ఆధారపడిన సంస్థలు మార్కెట్ నుంచి విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని, దీనివల్ల మొత్తం వ్యవస్థ పనితీరు దెబ్బతింటోందని వినతిపత్రంలో పరిశ్రమలు వివరించాయి. చాలా మటుకు కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకోవడమో లేక మూసివేయడమో చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపాయి. దీనితో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయి, అంతిమంగా వినియోగదారులపై భారం పడుతుందని పేర్కొన్నాయి.
పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్ ఐరన్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ తగ్గిపోయింది. జనవరి–మార్చిలోనే విద్యుత్, విద్యుత్‌యేతర రంగాలకు సమానంగా బొగ్గు సరఫరా జరిపి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని అవి తెలిపాయి. మరోవైపు, కోవిడ్–19 అనంతరం ఎకానమీలో డిమాండ్ ఒక్కసారిగా ఎగియడం, వేసవి మరికాస్త ముందుగానే రావడం, గ్యాస్ ధర .. దిగుమతి చేసుకున్న బొగ్గు రేటు పెరగడం, కోస్తా థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోవడం వంటి అంశాలు బొగ్గు కొరత.. విద్యుత్ డిమాండ్‌కు దారి తీశాయని బొగ్గు శాఖ కార్యదర్శి ఏకే జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment