సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలుమండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలుఅత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవసరాల నిమిత్తం బయటకు వెళ్తున్న సిటీజనులు వడదెబ్బకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, యాచకులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో చాలామంది తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఎండలకు తోడు సరైన నీరు, ఆహారం లభించకపోవడంతో వీధి కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. రోడ్డుపై వెళ్లేవారిపై దాడి చేస్తూ కాటేస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 40–50 మంది కుక్కకాటు బాధితులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వాడుతుండడంతో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఎండలకు వెలవెలబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, ఒకవేళ అనివార్యమైతే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సొమ్మసిల్లితే...
సహజంగా మనిషి రోజుకు 7–8 లీటర్ల నీరు తాగాలి. కానీ చాలామంది పని ఒత్తిడితో 2–3లీటర్లు కూడా తాగడం లేదు. ఇదిలా ఉంటే నగరానికి రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులు వచ్చి పోతున్నట్లు అంచనా. వివిధ పనులతో జిల్లాల నుంచి ఇక్కడికి రావడం, రోజంతా ఎండలో తిరగడం వల్ల అనేక మంది వడదెబ్బకు గురవుతున్నారు. ఇలాంటి వారిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లి నీటితో ముఖం శుభ్రం చేయాలి. నిమ్మకాయ, ఉప్పు కలిపిన వాటర్, కొబ్బరి బొండం తాగించాలి. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యనిపుణుడు
చిన్నారుల విషయంలో...
సెలవుల నేపథ్యంలో పిల్లలు ఎక్కువసేపు ఎండలో ఆడకుండా చూడాలి. ఎక్కువసేపు ఎండలో తిరిగితే వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయం 10గంటల లోపు, సాయంత్రం 5గంటల తర్వాతే బయటకు అనుమతించాలి. ఎండలకు త్వరగా దాహం వేస్తుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమటపొక్కుల సమస్య ఉండదు. రోజు రెండుసార్లు చన్నీటి స్నానం చేయించడంతో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవిలో పిల్లలకు చికెన్‌ఫాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలి.– డాక్టర్ రమేశ్ దంపురి, నిలోఫర్ ఆస్పత్రి
మంచినీరు తాగాలి...
నగరంలో చాలామంది ప్రతిరోజు టూవీలర్‌పై ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా మార్కెంటింగ్ వారు రోజుకు ఐదారు గంటలు రోడ్డుపైనే తిరగాల్సి ఉంటుంది. అతినీలలోహిత కిరణాలు నేరుగా ముఖానికి తగలడం వల్ల ముఖం, చేతులు నల్లగా వాడిపోతాయి. దాహం వేస్తే రోడ్డు పక్కనున్న చలివేంద్రాలు, హోటళ్లు తదితర ఎక్కడి నీరైనా తాగుతున్నారు. అయితే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరేచనాల బారినపడాల్సి వస్తుంది. శరీరానికి వేడిమినిచ్చే నల్లని దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం ఉత్తమం. – డాక్టర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి
వీధి కుక్కలతో జాగ్రత్త...
ఎండ ప్రభావం వీధి కుక్కలపై ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తదితర కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అవి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. అసలే కుక్కలకు వేట సహజ లక్షణం. ఆ లక్షణమే వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి కారణమవుతుంది. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదు అవుతుండడానికి కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండాకుళాయి నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలి. లేదంటే రేబీస్ సోకి చనిపోయే ప్రమాదం ఉంది. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment