సాక్షి, హైదరాబాద్: రైళ్లలో వేసవి రద్దీ పెరిగింది. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు జనం పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో నడిచే రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జూన్ నెలాఖరు వరకు అందుబాటులో ఉండేవిధంగా వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
ఆ రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరడం గమనార్హం. హైదరాబాద్ నుంచి కటక్, బికనేర్, రెక్సాల్, పట్నా తదితర ప్రాంతాలకు ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జనం పడిగాపులు కాయాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతి రోజు సుమారు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 వరకు ప్యాసింజర్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది ప్రయాణంచేస్తారు.
మరో 60 వేల మంది వరకు కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్‌ల నుంచి ప్రయాణిస్తారు. వేసవి సందర్భంగా గత నెల రోజులుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్లనుంచి సుమారు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. సొంత ఊళ్లకు వెళ్లేవారికంటే ఆధ్యాత్మీక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని సమాచారం.
దీంతో తిరుపతి, విశాఖ, ముంబై, షిరిడీ, ఢిల్లీ, వారణాసి, జైపూర్, కోల్కతా, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు తాకిడి పెరిగింది.గతంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 50 నుంచి 70 ప్రత్యేక రైళ్లను నడిపితే ఇప్పుడు వాటి సంఖ్య సగానికిపైగా తగ్గడం గమనార్హం.
అన్ని సదుపాయాలతో భారత్ గౌరవ్ రైళ్లు
ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్లలో వందశాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ వేసవి సీజన్‌లో సికింద్రాబాద్ నుంచి ఇప్పటి వరకు 8 రైళ్లు బయలుదేరాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని ఆధ్యాత్మీక క్షేత్రాలను సందర్శించేందుకు ఈ రైళ్లలో వెళుతున్నారు. ‘పూరీ– కాశి– అయోధ్య‘పేరుతో ఐఆర్‌సీటీసీ ఇటీవల భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ రైలులో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీయే అన్ని రకాల సేవలను అందజేస్తోంది. ఈ పర్యటనలో రైలు ప్రయాణంతో పాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర అన్ని ఏర్పాట్లు ఉంటాయి. రైలులో సీసీ కెమెరాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయా విష్ణు పాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయం, అయోధ్య రామజన్మ భూమి, ప్రయాగ్ రాజ్ తదితర ప్రాంతాలను సందర్శించ వచ్చు.8 రాత్రులు, 9 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది.
ఈ ట్రైన్‌లో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రధాన స్టేషన్‌లలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇప్పటి వరకు నడిచిన 8 ట్రిప్పుల్లో రైలులోని మొత్తం 700 సీట్లు రిజర్వ్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment