వేసవి నేస్తం.. తీరుస్తుంది మీ తాపం! | Water melon saves us from sun stroke | Sakshi
Sakshi News home page

వేసవి నేస్తం.. తీరుస్తుంది మీ తాపం!

Published Wed, Feb 24 2016 9:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

వేసవి నేస్తం.. తీరుస్తుంది మీ తాపం!

వేసవి నేస్తం.. తీరుస్తుంది మీ తాపం!

వేసవి పేరు చెప్పగానే భగభగ మండే భానుడి ఎండ ప్రతాపం గుర్తుకు రావడం ఎంత సహజమో.. వాటి నుంచి ఉపశమనం ఇచ్చే తియ్యనైన చల్లని పుచ్చకాయ ముక్కలు గుర్తుకురావడం కూడా అంతే సహజం. వీటి రుచిని ఆస్వాదించకుండా వేసవి పూర్తికాదనే చెప్పాలి. అందరికీ అందుబాటు ధరలో అత్యధిక పోషకాలనందిస్తూ వేసవి తాపాన్ని తీరుస్తున్నాయి. మార్చిలో కూడా అడుగుపెట్టక ముందే అప్పడే భానుడు తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు. అందుకే మార్కెట్‌లో పుచ్చకాయల వినియోగం ఊపందుకుంది. ఈరోజు వాటి విశేషాల గురించి తెలుసుకుందాం..!
 - సాక్షి, స్కూల్ ఎడిషన్
 
పుచ్చకాయనే కర్జూజ అని కూడా పిలుస్తారు. దీన్ని మన దేశంలో ఉద్యాన పంటగా సాగుచేస్తున్నారు. పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా ఈజిప్టులో ఐదు వేల ఏళ్ల క్రితమే పుచ్చను పండించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చకాయ రుచి ఎంతో నచ్చడం వల్లే వారి గోడల మీదున్న చిత్రాల్లో వీటికి చోటు కల్పించారు. సమాధుల్లో కూడా వీటిని ఉంచేవారట. 13వ శతాబ్దానికి ఈ పంట యూరప్‌కు విస్తరించింది.
 
 మన దేశానికి..
 క్రీ.శ నాలుగో శతాబ్దంలో మనదేశానికి పుచ్చకాయ వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇక్కడే పుట్టిందని వాదించే వాళ్లూ ఉన్నారు. శుశృతుడు తన శుశృత సంహితలో సింధునదీ తీరంలో పుచ్చకాయలను పండించినట్టు పేర్కొన్నాడు. అందులో దీన్ని ‘కళింద’గా రాసాడట. పొడిగా ఉండే ఉష్ణమండల వాతావరణంలో ఎలాంటి నేలలో అయినా పుచ్చ పంటను సాగుచేయవచ్చు. అందుకే ఇది ప్రపంచమంతా విస్తరించింది. ఈ పంట అమెరికన్లకు 17వ శతాబ్దంలో పరిచయమయింది.
 
 పోషకాలమయం..
ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి లభ్యమవుతున్నా వేసవిలో పండించే వాటికి నాణ్యత, రుచి ఎక్కువ. బి-విటమన్లు, పొటాషియం సమృద్ధిగా లభించే పుచ్చకాయల నుంచి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుతాయి. బి-విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన శరీరానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముదురు ఎరుపు లేక గులాబీ రంగు పుచ్చకాయలో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్లు అధికంగా లభ్యమవుతాయి. వీటిని మన శరీరం ఎ-విటమిన్‌గా మార్చుకుంటుంది. వీటితో పాటు విటమిన్ బీ6, విటమిన్ సీ, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. మిగిలిన పండ్లతో పోల్చుకుంటే నీటి శాతం వీటిలో అత్యధికం.
 
 విశేషాలు..
 -     అమెరికన్లు పుచ్చ పంటను సాగుచేయడంలో ఆఫ్రికన్లతో పోటీపడి అనేక ప్రయోగాలు చేస్తూన్నారు.  గింజలు లేని పుచ్చకాయల్ని పండించడంతో పాటు ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పండిస్తున్నారు.
 -     వీటి ఉత్పత్తిలో అమెరికాది నాలుగో స్థానం.
 -    జపాన్లో చతురస్రాకారంలో ఉండే పుచ్చకాయల్ని పండిస్తున్నారు. పిందె దశలో ఉన్నప్పుడే కావాల్సిన పరిమాణంలో ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క పెట్టెలో తీగకు ఉన్న పిందెను అమర్చుతారు. అది క్రమంగా అదే ఆకారంలో అమరుతుంది. ఇవి చూడటానికి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
 -     చైనా,జపాన్లలో ఇంటికి వచ్చే అతిథులు ఎక్కువగా తెచ్చే బహుమతులు పుచ్చకాయలే.
 -     సాధారణ పుచ్చకాయ బరువు 5-10 కిలోల బరువుంటే, వీటికి భిన్నంగా అమెరికాలో 20 కిలోల బరువుండే పుచ్చకాయల్ని పెంచుతారు.
 -     అమెరికాలోని ఎరింగ్టన్‌కు చెందిన బిల్‌కార్నర్ 119 కిలోల బరువున్న పుచ్చకాయను పండించాడు.
 -     పుచ్చలు డిసెంబర్ నుంచి మే వరకు బాగా పండుతాయి.
 -     ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల్లో పుచ్చకాయముక్కలకు ఉప్పగా ఉండే చీజ్ ముక్కలు చేర్చి తినడాన్ని బాగా ఇష్టపడతారు.
 
 100 గ్రాములు పుచ్చకాయ గుజ్జులో..
 1 నీరు - 95.2 గ్రా
 1 ప్రోటీన్ - 0.3 గ్రా
 1 కొవ్వు పదార్థాలు - 0.2 గ్రా
 1 పీచు పదార్థాలు - 0.4 గ్రా
 1 కెరోటిన్ - 169 మి.గ్రా
 1 సీ విటమిన్ - 26 మి.గ్రా
 1 కాల్షియం - 32 మి.గ్రా
 1 ఫాస్పరస్ - 14 మి.గ్రా
 1 ఇనుము - 1.4 మి.గ్రా
 1 సోడియం - 104.6 మి.గ్రా
 1 పొటాషియం - 341 మి.గ్రా
 1 శక్తి - 17 కిలోక్యాలరీలు
 
 విభిన్న రకాలు..
 ప్రపంచవ్యాప్తంగా 1200 రకాల పుచ్చ జాతుల్ని పండిస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి..
 1 నూర్జహాన్
 1 షర్బత్-ఎ- అనార్
 1 అనార్కలీ
 1 షుగర్బేబీ (మహారాష్ట్రలోని
 అమెరికా రకం)
 1 అసాహా యమటో (పశ్చిమ
 బెంగాల్లోని జపాన్ రకం)
 1    నందారి (ఏపీలో అధికంగా పండించే రకం)
 1 రెడ్ టైగర్   1 ఆల్ స్వీట్
 1 వాల్ పెయింట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement