జలవిల! | Ground Water Levels Down in Hyderabad | Sakshi
Sakshi News home page

జలవిల!

Published Wed, Feb 6 2019 10:27 AM | Last Updated on Wed, Feb 6 2019 10:27 AM

Ground Water Levels Down in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మండు వేసవి రాకముందే గ్రేటర్‌లో భూగర్భజలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో జలం అడుగంటుతోంది. ఫిబ్రవరి తొలివారంలోనే గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. భూగర్భజల శాఖ నుంచి సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీజిబిలిటీ)అందిన తరువాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్‌ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది. ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేసవి మొదలుకాకముందే వెయ్యి అడుగులకుపైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది.

ట్యాంకర్‌ మాఫియా...
ప్రధానంగా కుత్భుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్‌ మాఫియా..ఈ నీటిని అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌వాటర్‌ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు, విచక్షణారహితంగా నీటిని తోడేస్తుండడంతో భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్‌..
బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి  చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్‌ పిట్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతున్నాయని పేర్కొంది.

గ్రేటర్‌లో ఇలా...
సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్‌ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా.

ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు,కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. 

ఇంట్లో ఇంకుడు గుంత ఇలా...
సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్‌),1.5 మీటర్ల పొడవు,1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగాను 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ఈ ఇంకుడు గుంతలో సీజన్‌లో సాధారణ వర్షపాతం(20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో ..రోజుకు 1600 లీటర్ల నీటిని నేలగర్భంలోకి ఇంకించవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement