సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా సూచనలు చేసింది. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని పేర్కొంది. దాహం వేసేంతవరకు వేచిచూడడం మంచి సూచిక కాదని తెలిపింది. పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దనీ, వాహనం లోపల ఉష్ణోగ్రత ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది.
►బయటకు వెళ్లేప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్)ను వినియోగించాలి. నిమ్మరసం, మజ్జిగ, లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు, ఉప్పు కలిపిన పండ్ల రసాలను తీసుకోవాలి. పుచ్చ, కర్బూజ, ఆరెంజ్, ద్రాక్ష, వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలను తినాలి.
అలాగే పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినాలని సూచించింది. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. గొడుగు, టోపీ, టవల్ వంటి ఇతర సాంప్రదాయ పద్ధతుల్లో తలను ఎండ వేడి నుంచి రక్షించుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చెప్పులు తప్పనిసరిగా ధరించాలి.
ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
►బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని ప్రదేశాల్లో ఉండాలి. ప్రత్యక్ష సూర్యకాంతి, వేడి గాలులను నిరోధించాలి. పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి.
►ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
►అనారోగ్యంతో ఉన్నవారు ఎండాకాలంలో ఇతరులకన్నా ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. వీరు అదనపు శ్రద్ధ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి.
►ఒంటరిగా నివసించే వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యాన్ని ప్రతి రోజూ పర్యవేక్షించాలి.
►శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, తడిబట్టలను ఉపయోగించాలి.
►మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దు. ఒకవేళ వచ్చినా ఎండలో శారీరకమైన కఠినమైన పనులు చేయకూడదు.
►తీవ్రమైన ఎండ సమయంలో వంట గదిలో వంట చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే వంటిల్లు వెంటిలేషన్‌తో ఉండాలి. వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవాలి.
►ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తీసుకోకూడదు. ఇవి శరీర ద్రవాన్ని కోల్పోవడానికి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు.
►ఆరు బయట పనిచేసే కార్మికుల కోసం పని ప్రదేశంలో చల్లని తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ప్రతి 20 నిమిషాలకు ఒక గ్లాసు నీరు తాగాలని వారికి చెప్పాలి.
►సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 97.5ని ఫారిన్‌హీట్ నుండి 98.9ని ఫారీన్ హీట్ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment