![Expert Tips To Lose Weight Healthy Way During Summers - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/17/walking.jpg.webp?itok=Y-tOPIpE)
బరువు పెరిగిపోతున్నామని జనం తెగ బెంగపడిపోతున్నారు. పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ఫిట్‌నెస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు మారుతున్న జీవన విధానంలో జీహ్వా చాపల్యాన్ని అదుపులో ఉంచుకోలేక పోతున్నారు. సరికొత్త రుచులకు అలవాటు పడి బరువును పెంచేసుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి కుస్తీలు పడుతున్నారు. ఇలా అధిక బరువుతో బాధ పడుతూ ఎలాగైనా తగ్గాలనుకునే వారికి వేసవి వరంలాంటిది. ఫిట్‌నెస్ కేంద్రాల్లో ఎలాంటి ఫీట్లు చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని చిట్కాలతో స్లిమ్‌గా మారొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రస్తుత యాంత్రిక జీవనంలో సమయాన్ని ఎన్నో రకాల పనులకు వెచ్చిస్తున్నారు. వాటి వలన తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. దీనిని నడకలో తేలికగా అధిగమించవచ్చు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చన్నీటి స్నానం తర్వాత వ్యాయామం
తక్కువ బరువు ఉండి, చెమటను త్వరగా పీల్చే దుస్తులతో వ్యాయామం చేయడం ఉత్తమం. వేసవిలో వర్క్‌అవుట్లు కష్టతరమైన యోగాసనాలు, సూర్య నమస్కారాలు తక్కువ చేయడం మంచిది. బరువు తగ్గాలనుకున్న వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం. వర్క్ అవుట్ చేయడానికి ముందే చన్నీటి స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రత పెరగదు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరం. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి. వాకింగ్, జాగింగ్ వంటివి మినహాయిస్తే వర్క్‌అవుట్లు చేయాంటే మాత్రం ఫిట్‌నెస్ ట్రైనర్ సూచనలు తీసుకోవడం మంచిది.
ద్రవ పదార్ధాలు ఎక్కువుగా...
ఎంతటి భోజన ప్రియులైన వేసవి కాలంలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు. వేసవిలో ఘన పదార్ధాల కంటే ద్రవ పదార్ధాలను ఎక్కువుగా తీసుకోవాలనిపిస్తుంది. ఆకలి తక్కువుగా ఉంటుంది. 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి చొప్పున రోజుకి కనీసం 5 లీటర్ల నీరు వివిధ రూపాల్లో తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటి కన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. గొంతు నొప్పి తదితర సమస్యలు తలెత్తవు.
చదవండి: (బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా సీహెచ్ ప్రతాప్‌రెడ్డి)
శీతల ప్రాణయామం...
వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం 8 నుంచే మొదలవుతుంది. ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువుగా తాగాలి. నీటితో పాటు, శీతల ప్రాణయామం చేస్తే కొంత వరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. శీతల ప్రాణయామం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కు ద్వారా వదిలే పక్రియే శీతల ప్రాణయామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఆహారం తీసుకుంటే మేలు..
►నీటి శాతం ఎక్కువుగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లవణాలు అందుతాయి.
►నీటి శాతం ఎక్కువుగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన కడుపు నిండినట్లు ఉంటుంది. డైట్ కంట్రోల్ అవుతుంది.
►శీతల పానీయాలు, అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి.
►వేసవిలో ఆకలి తక్కువుగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.
నీరసం రాకుండా జాగ్రత్త పడాలి
వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. శరీరం ఎంత వరకు సహకరిస్తే అంతే మితంగా చేయాలి. బరువు తగ్గాలని అదే పనిగా వాకింగ్ చేస్తే నీరసం తప్పదు. ఎండలో వాకింగ్ చేయడం ప్రమాదం. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. అందుకే నీటి శాతం ఎక్కువుగా ఉన్న పండ్లు తీసుకోవాలి.
– కొమ్మూరి హరిత, ఆహార నిపుణులు(న్యూట్రీషియన్)
Comments
Please login to add a commentAdd a comment