2017 నుంచి విదేశాలకు గోఎయిర్
కంపెనీ సీఈవో ఊల్ఫ్‌గాంగ్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది వేసవి సీజన్ నుంచి విదేశీ రూట్లలోనూ సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నాయని ప్రైవేట్ విమానయాన సంస్థ గోఎయిర్ సీఈవో ఊల్ఫ్‌గాంగ్ ప్రాక్-షోర్ వెల్లడించారు. ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, చైనా, ఇరాన్, వియత్నాం తదితర దేశాలకు విమాన సేవలు మొదలు కాగలవన్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు మొదలైన రూట్లలో గోఎయిర్ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
ప్రస్తుతం 20గా ఉన్న విమానాల సంఖ్యను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు కల్లా 26కి పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటిదాకా 144 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డరివ్వగా.. వచ్చే పదేళ్లలో నెలకొకటి చొప్పున 2025 నాటికల్లా డెలివరీ అందుకోగలమన్నారు. వీటిలో సింహభాగం సేల్, లీజ్‌బ్యాక్ విధానంలో ఉంటాయని చెప్పారు.
దేశీయ మార్కెట్లో తమ వాటా దాదాపు 8 శాతం మేర ఉందని, అయిదో స్థానంలో ఉన్నామని ఊల్ఫ్‌గాంగ్ వివరించారు. రోజూ 23 నగరాల మధ్య తమ 144 ఫ్లయిట్స్ తిరుగుతుండగా .. డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 184కి చేరగలదని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమ వృద్ధి రేటు 20 శాతం మేర ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ముడివనరుల వ్యయాల పెరుగుదల, మౌలిక సదుపాయాలపరమైన అడ్డంకులు మొదలైనవి డిమాండ్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
అయితే, 10 శాతం పైగా.. 15 శాతం మేర వృద్ధి రేటు నమోదైనా మెరుగైనదిగానే భావించవచ్చని ఊల్ఫ్‌గాంగ్ తెలిపారు. ప్రాంతీయ పట్టణాలకు విమాన సేవల పథకంపై స్పందిస్తూ.. ప్రస్తు తం తమ విమానాలకు అనువుగా ఉన్న పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.