
అధికారుల సమన్వయ లోపం... ప్రజలకు శాపం
మలేరియా వ్యాధిని అదుపు చేయడానికి దశాబ్దాల కాలంగా ప్రత్యేకంగా ఒక విభాగం ఉన్నా.. ఇప్పటికీ మలేరియా విజృంభిస్తూనే ఉంది. ఏటా మలేరియా మాసోత్సవాలు తంతుగా నిర్వహించి చేతులు దులుపుకోవడమే తప్ప చిత్తశుద్ధి లోపించడమే ఇందుకు కారణం. దానికితోడు మలేరియా అధికారులు, మున్సిపల్, పంచాయతీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది.
సాక్షి, గుంటూరు: వేసవికాలం ముగిసి వానాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి జ్వరాలతో మంచానపడుతుంటారు. మలేరియాను నివారించాలంటే ముందుగా దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.
గామీణ ప్రాంతాల్లో పంచాయతీ అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో మలేరియా అధికారులకు సమన్వయం లేకపోవడంతో ఎవరికివారే యమునాతేరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.గ్రామాల్లో, పట్టణాల్లో పంచాయతీ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఫాగింగ్ నిర్వహించాలి. మురుగు కాల్వల్లో లార్విసైడ్ మందులను పిచికారీ చేయాలి. మలేరియా అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని ఏఎన్‌ఎమ్‌లు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్ల సహాయంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలి.
సిబ్బంది కొరత కావచ్చు లేక నిర్లక్ష్యంతో కావచ్చు ఎక్కడో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేదా ఎలిమెంటరీ పాఠశాలల్లో ఒక సమావేశం నిర్వహించి ఫొటోలు దిగి హడావుడి చేసి అవగాహన కార్యక్రమాన్ని మమః అనిపిస్తున్నారు.
మలేరియా దోమ రాత్రిపూటే కుడుతుంది కాబట్టి, మలేరియా శాంపిల్స్ కూడా రాత్రి పూట మాత్రమే తీయాల్సి ఉండగా అధికశాతం మంది పగటిపూట శాంపిల్స్ తీసి అసలు మలేరియా అనేది లేదని ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో సరైన సమాచారం లేక వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. గ్రామాల్లో వారానికి ఒకసారి డ్రైడే పాటించేలా పంచాయతీ అధికారులతో కలసి ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. ఇవేమీ చేయకుండా మలేరియా నివారించడం జరిగేపని కాదని తెలిసినా అధికారుల్లో మాత్రం మార్పు రాకపోవడం శోచనీయం.
ప్రజల జేబులు గుల్ల చేస్తున్న ప్రయోగశాలలు.. వర్షాకాలం వచ్చిందంటే పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ల నిర్వాహకులకు పంట పండినట్లే. ఈ కాలంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తాయి కనుక వీటిని అడ్డుపెట్టుకుని రక్త పరీక్షలు జరిపి, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో కుమ్మక్కై ఆ జ్వరాలు వచ్చినా, రాకపోయినా ఉన్నాయంటూ నిర్ధారణ చేస్తున్నారు. దీంతో కోర్సు వాడి రోగులు నీరసించడంతోపాటు, జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
మలేరియా అధికారులు గ్రామాల్లో తిరిగి శాంపిల్స్ సేకరించి సరైన పరీక్షలు జరిపి వ్యాధిని నిర్ధారిస్తే ఇలాంటి వాటికి అవకాశం ఉండదని వైద్య నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తరచూ ల్యాబ్‌లపై దాడులు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారి లెసైన్స్‌లు రద్దుచేసి క్రిమినల్ కేసులు నమోదుచేస్తే కొంత మేరకు వీటిని అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు.
నేటి నుంచి మలేరియా మాసోత్సవాలు.. మలేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది నిర్వహించినట్టే శుక్రవారం(జూన్ 13వ తేదీ) నుంచి మలేరియా మాసోత్సవాలు జరిపేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. మలేరియా రాకుండా, నివారణ చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, ర్యాలీలు కూడా నిర్వహించనున్నారు. జిల్లాలో ఇప్పటికే 85 గ్రామాల్లో 100 ప్రాంతాలను, 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలను, ఒక నగరపాలక సంస్థ పరిథిలోని 33 ప్రాంతాలను, మూడు మున్సిపాలిటీల పరిథిలోని నాలుగు ప్రాంతాలను మలేరియా అధికంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు.