అరండల్‌పేట,(గుంటూరు) న్యూస్‌లైన్: రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. సురేశ్‌కుమార్ పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. అలాగే సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపు కోవాలన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు సమస్యపై మాట్లాడుతూ ఆ ట్యాంకును సాగర్ కాలువ మూసివేసే లోపు అదనపు మోటార్లు పెట్టి నింపేలా చూడాలన్నారు.
తాగునీటి పథకాలన్నీ వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. తాగునీటి పథకం అందని ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. అలాగే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ ఇచ్చేలా చూడాలన్నారు. కొన్ని పురపాలక సంఘాల్లో ప్రజలు తమ అవసరాల నిమిత్తం డబ్బు వెచ్చించి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారని సకాలంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తే ప్రజలు డబ్బు వెచ్చించరన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రధానంగా మంగళగిరిలో రూ. 25 కోట్లతో ప్రత్యేకంగా తాగునీటి పథకాన్ని తీసుకువచ్చినా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను వెంటనే అధిగమించి తాగునీరు అందించేందుకు కమిషనర్ చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు. సంపూర్ణ పారిశుధ్యం వందరోజుల కార్యక్రమం కేవలం తెనాలి పురపాలక సంఘంలో మాత్రమే పూర్తిస్థాయిలో అమలవుతుందని, మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించాలన్నారు.
ప్రజలను భాగస్వామ్యులను చేయాలి
గుంటూరు నగరం సుందరంగా ఉండాలంటే కార్పొరేషన్ అధికారులు తమ పని తాము చేసుకు వెళ్లాలన్నారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్ మెంట్‌లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలన్నారు. పారిశుధ్య కార్యక్రమంలో ప్రజల సహకారం ఉంటే ఆరోగ్య సమస్యలు, దోమల బాధలు తగ్గుతాయన్నారు. కార్పొరేషన్, ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. త్వరలోనే పట్టణ ప్రణాళికా ద్వారా 12 సేవలను ‘మీ సేవ’ ద్వారా అందించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. వంద శాతం పన్నులు వసూలు చేసేలా చూడాలన్నారు. వీధుల్లో వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అనాథలు, వృద్ధులు, నిరాశ్రయులకు రాత్రి వసతి గృహాలు కల్పించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, అదనపు కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆర్‌డి శ్రీనివాసులు, పట్టణ ప్రణాళిక ఆర్‌జేడి వెంకటపతిరెడ్డి, ఎస్‌ఈ ఆదిశేషు, పురపాలకసంఘాల కమిషనర్లు, బిసి,ఎస్‌సి,ఎస్‌టి కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు
Published Fri, Dec 20 2013 6:52 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement