సమ్మర్ సీజన్..
‘కొబ్బరి నీళ్ల జలకాలాడి కోనాసీమ కోకాగట్టి’... అని రాశాడు వేటూరి.
కొబ్బరి నీళ్లతో జలకాలాడే భాగ్యం సామాన్యుడికి లేదు. పూర్వం కొన్ని బావుల్లో నీళ్లు కొబ్బరి నీళ్లలా అనిపించేవి. జనానికి ఆ బావి ఫేవరెట్‌గా ఉండేది. ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ముళ్లపూడి వెంకట రమణ అన్నట్టు ఎన్ని బిస్లరీ బాటిళ్ల నీళ్లైనా ఒక్క కొబ్బరిబోండాంకు సమానం కావు.
సృష్టి మొత్తం మీద గర్భాన తియ్యటి, శుభ్రమైన నీళ్లను దాచుకున్న కాయ కొబ్బరికాయ మాత్రమే. పండ్ల రసాలు తయారు చేసేటప్పుడు ఏదో ఒక మేరకు ఇన్ఫెక్ట్ కావచ్చు. కాని కొబ్బరినీళ్లను కలుషితం చేయలేము. అందుకే వేసవి వచ్చిందంటే ఎండలో కాయకష్టం చేసేవారికి, రోజంతా రోడ్ల పై తిరిగే సన్న జీవులకి, కార్లలో తిరిగే కలిగిన వారికీ కూడా కొబ్బరినీళ్లు ప్రాణధార.
అదేమిటోకాని కొన్ని విషయాలు విశ్వామిత్రుడి అకౌంట్‌లో పడ్డాయి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం కొబ్బరికాయ బ్రహ్మదేవుని సృష్టి కాదట. విశ్వామిత్రుడిది అట. ఎవరు సృష్టించినా భారతీయులకు కొబ్బరికాయ లేకుండా పూట గడవదు. భక్తి కలిగిన వారికి పూజల్లో, జఠరాగ్ని కలిగిన వారికి వంటల్లో కొబ్బరి తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి మార్చి వచ్చిందంటే గెలలు గెలలుగా దిగే కాయ కత్తికి సర్రున తెగుతూ తన నీటితో జిహ్వకు జీవం పోస్తుంది. కాని కొబ్బరి నీళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకొని ఉండి వాటిని సేవించడం మంచిది.
ప్రయోజనాలు..
కొబ్బరి నీళ్లు పోషకాలు, ఎలక్ట్రోలైట్లను ఇస్తాయి. ఒక రకంగా కొబ్బరి నీళ్లు నోటి ద్వారా ఒంట్లో చేరే సెలైన్‌బాటిల్‌తో సమానం. మన శరీరానికి రోజుకు కనీసం 280 మిల్లిగ్రాముల సోడియం కావాలి. ఒక కొబ్బరిబోండాంలో దాదాపు 300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అంటే శరీరానికి కావాల్సిన సోడియం రోజుకు సరిపడా అందినట్టే. ఇక పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లు ఉత్తమ లవణ జలం.
వీటిని మధ్యాహ్న భోజనానికి ఒక గంట ముందు, లేదా సాయంత్రం వేళల్లో తీసుకుంటే మంచిది. వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి కొబ్బరినీళ్లు ఉత్తమ సహాయకారి. ఎండల్లో వాంతులు, విరేచనాలు అవుతుంటే కొబ్బరినీళ్లను మెల్లమెల్లగా ఎక్కువసేపు తాగితే శరీరం పుంజుకుంటుంది. ఎండ వల్ల చర్మం టాన్ అయితే కొబ్బరినీళ్లతో బాగా రుద్దితే ఆ టాన్ పోతుంది. ముఖంపై మొటిమలు ఉంటే కొబ్బరినీళ్లలో ముంచిన దూదితో శుభ్రం చేస్తే అవి పోతాయి.
వేసవిలో చెమట వల్ల వచ్చే దుర్వాసన పోవాలంటే కొబ్బరినీళ్లు తాగాలి. జీర్ణక్రియకు మంచిది. కొబ్బరినీళ్లలో ఉన్న పొటాషియం బీపీని నియంత్రించడానికి, కిడ్నీల పని తీరుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లలో యాలకుల పొడి చిటికెడు వేసుకుని తాగితే అరికాళ్లలో మంటలు తగ్గుతాయి. ‘దేహమే దేవాలయం’ అన్నారు. దేవాలయంలో కొబ్బరికాయ కొడితే ఏ ఆధ్యాత్మిక ఫలితాలు కలుగుతాయో, కొబ్బరినీళ్లు తాగితే దేహమనే దేవాలయానికి అవే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment