
న్యూఢిల్లీ: దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. అయితే కోస్తా ఆంధ్ర ప్రాంతంతోపాటు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అప్పుడప్పుడు కురుస్తాయనీ, తద్వారా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ చెప్పారు.
రుతుపవనాలు సరైన సమయానికే వస్తాయనడానికి ఇదొక సూచిక కూడా అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సమయాన్ని ఐఎండీ వేసవి కాలంగా పరిగణిస్తుంది. గత సంవత్సరాల్లో మాదిరిగానే ఈ ఏడాది కూడా మధ్య, ఉత్తర భారతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించిపోతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. 2017ను అత్యంత వేడి సంవత్సరంగా ఐఎండీ గుర్తించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగానే నమోదైనా.. 2017తో పోలిస్తే అవి తక్కువగానే ఉంటాయని అంచనా వేస్తుండటం ఒకింత ఊరటనిచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment