Weather: జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే! | Summer Record of temperatures in excess of normal | Sakshi
Sakshi News home page

జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే!.. అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు

Published Fri, Mar 29 2024 1:23 AM | Last Updated on Fri, Mar 29 2024 7:28 AM

Summer Record of temperatures in excess of normal - Sakshi

సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అదనంగా నమోదు 

ఎల్‌నినో ప్రభావం జూన్‌ వరకు ఉంటుందని వాతావరణశాఖ అంచనాలు 

అంటే వచ్చే రెండు నెలల పాటు ‘వేడి సెగలు’ తప్పవంటున్న నిపుణులు 

రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 

ఏప్రిల్‌ నుంచి ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యుల సూచనలు

ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసా­గుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి.  

ఈసారి భగభగలు తప్పనట్టే.. 
దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.  

చాలా చోట్ల 40 డిగ్రీలకుపైనే నమోదు 
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
తీవ్రమైన ఉక్కపోత.. ఆరు బయట జాగ్రత్త 

అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. 
 
‘దక్షిణం’లో తీవ్ర వర్షాభావం.. 
భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి.  
 
సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా నమోదు 
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. 

కాగా.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

ఏప్రిల్‌లో మరింత ఎక్కువ ఎండలు.. 
గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్‌ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్‌లను జారీ చేస్తాం. ఏప్రిల్‌ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్‌ విడుదల చేస్తాం. 
– నాగరత్న, ఐఎండీ డైరెక్టర్‌ 
 
ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతల తీరు (డిగ్రీల సెల్సియస్‌లలో) 
కేంద్రం            గరిష్టం        కనిష్టం 
ఆదిలాబాద్‌        40.8           25.5 
భద్రాచలం        40.0           25.0 
నిజామాబాద్‌       39.9          25.0 
ఖమ్మం              39.6          24.0 
నల్లగొండ           39.5         24.2 
హైదరాబాద్‌       39.2        24.6 
మహబూబ్‌నగర్‌  39.2       25.0 
మెదక్‌                 39.2        21.1 
దుండిగల్‌           39.1        22.2 
హకీంపేట్‌           39.0        20.1 
రామగుండం       38.6        24.6 
హన్మకొండ          38.0        22.5 
 
ఈ జాగ్రత్తలు తప్పనిసరి 
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏదైనా పని కోసం బయటికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ నీళ్లు తాగాలని, డీహైడ్రేషన్‌ తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇంకా వైద్యులు సూచనలు ఇవీ.. 

  •  బయటికి వెళ్లేవారు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్‌ వ్రస్తాలు ధరించాలి. తలపై టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. 
  • నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ వంటివి తాగుతూ ఉండాలి. 
  • ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. 
  •  అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 
  • పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement