వేసవి కాలం వచ్చిందంటే వడియాలు, అప్పడాలు, ఆవకాయ తదితర పచ్చళ్ళ సందడి షురూ అవుతుంది. వీటిని సంవత్సరం మొత్తానికి సరిపోయేలా తయారు చేసుకోవడంలో గృహిణులు చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా గుమ్మడి వడియాలు పిండి వడియాలు, మినప,పెసర వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇలా ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి సులువుగా తయారు చేసుకునే చిట్టి మినప వడియాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!
చిట్టి చిట్టి మినప వడియాలు తయారీకి కావాల్సినవి
అరకిలో మినపప్పు (తొక్కతో ఉన్నదైతే వడియాలు గుల్లగా వస్తాయి)
పచ్చిమిరపకాయలు బాగా కారం ఉండేవి 10
కొద్దిగా ఉప్పు, జీలకర్ర, కొద్దిగా అల్లం
తయారీ
ముందు రోజు రాత్రి నాన బెట్టి ఉంచుకున్న మినప పప్పును శుభ్రంగా కడిగి గ్రౌండర్‌లోగానీ, రోటిలోగానీ మెత్తగా రుబ్బు కోవాలి. ఎక్కువ జారుగా కాకుండా, గట్టి ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి కారం కలిపిన తరువాత మరింత జారుగా అయిపోతుంది పిండి.
ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్న పిండిలో ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కారం కలుపుకోవాలి. ఆ తరువాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి(ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు) బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని శుభ్రమైన తడి గుడ్డపై గానీ, ప్లాస్టిక్ కవరైగానీ వేసుకుని ఎండబెట్టుకోవాలి. చక్కగా గల గల మనేలా డేలా ఎర్రటి ఎండలో రెండు మూడు రోజులు ఉంచాలి. వీటిని గుడ్డనుంచి తీసిన తరువాత ఒక బేసిన్‌లో వేసుకుని మరోసారి ఎండలో పెట్టాలి. పచ్చి లేకుండా బాగా ఎండాయో లేదో చెక్ చేసుకొని వీటిని తడిలేని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి.
ఈ చిట్టి వడియాలు కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయలతో కలిపి ఇగురు కూరలా చేసుకోవచ్చు. చాలా కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. పులుసు కూరల్లో వాడుకోవచ్చు. సైడ్ డిష్‌గా కూడా భలే ఉంటాయి.
మినప పప్పులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పిల్లలకు, పెద్దవాళ్లతోపాటు అందరికీ మంచిది. మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది
Comments
Please login to add a commentAdd a comment