vadiyalu
-
సమ్మర్ సీజన్ వేడిలో.. వడియాలకై కాచుకోండి!
మార్చి మూడు వంతులు గడిచింది. ఆహారం ఎండబెట్టే కాలం వచ్చింది. ఏడాదికి సరిపడా నిల్వ చేయాలి. వానల్లో వెచ్చగా వేయించుకు తినాలి. చలిలో కరకరలాడే రుచిని ఆస్వాదించాలి. ఏప్రిల్ నెలకు ఎండ తీవ్రత పెరుగుతుంది. వడగాలి వచ్చి దుమ్మెత్తి పోయకముందే... వడియాలకు దినుసులు సిద్ధం చేద్దాం. ఎండబెట్టమని సూర్యుడికి పని చెబుదాం. బియ్యప్పిండి వడియాలు కావలసినవి: బియ్యప్పిండి – ఒక గ్లాసు సగ్గుబియ్యం – పావు కప్పు ఎండుమిర్చి – 2 జీలకర్ర – టీ స్పూన్ ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి నూనె – వేయించడానికి తగినంత. తయారీ విధానం: ఒక పాత్రలో బియ్యప్పిండి వేసి అందులో రెండు గ్లాసుల నీటిని పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో సగ్గుబియ్యం వేసి మునిగేలా నీటిని పోసి పక్కన పెట్టాలి. మిక్సీలో ఎండుమిర్చిని గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. మెత్తగా గ్రైండ్ కావాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద పాత్రలో ఆరుగ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత ఉప్పు కలపాలి. నీరు మరగడం మొదలైన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలిపి మూత పెట్టాలి. సగ్గుబియ్యం ఉడకడం మొదలైన తర్వాత నానబెట్టిన బియ్యప్పిండిని పోసి కలపాలి. పిండి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. పిండి ఉడికేటప్పుడు ఎండుమిర్చి పొడి, జీలకర్ర వేసి కలిపి దించేయాలి. వడియాల పిండి వేడి తగ్గేలోపు నూలు వస్త్రాన్ని తడిపి నేల మీద పరిచి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని స్పూన్‌తో వడియాలుగా పెట్టాలి. రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత క్లాత్‌కు వెనుకవైపు నీటిని చల్లి వడియాలను వలిచి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ వడియాలు చాలా త్వరగా వేగుతాయి. నూనెలో వేసిన తర్వాత పొంగి పువ్వుల్లా విచ్చుకోవడం మొదలవుతుంది. అప్పుడు చిల్లుల గరిటెతో నూనెలో ముంచినట్లయితే రెండు వైపులా సమంగా వేగుతాయి. వీటిని తెల్లగా ఉండగానే నూనెలో నుంచి తీసేయాలి. తీయడం ఆలస్యమైతే ఎరుపురంగులోకి మారిపోయి చేదు వస్తుంది. బియ్యం..సగ్గుబియ్యం వడియాలు కావలసినవి: బియ్యం – ఒక గ్లాసు సగ్గుబియ్యం – పావు గ్లాసు పచ్చిమిర్చి – 2 అల్లం – అంగుళం ముక్క జీలకర్ర – టీ స్పూన్ ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి తయారీ విధానం: బియ్యం, సగ్గుబియ్యాన్ని కడిగి మంచినీటిలో నానబెట్టాలి. ఆరు గంటల తర్వాత మిక్సీ జార్లో వేసి, తగినంత నీటిని పోస్తూ, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. దోసెల పిండిలాగ మెత్తగా గరిటె జారుడుగా రుబ్బుకోవాలి. మరొక జార్లో పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. పెద్ద పాత్రలో ఐదు గ్లాసుల నీటిని పోసి మరిగిన తర్వాత బియ్యప్పిండి మిశ్రమాన్ని పోసి గరిటెతో కలపాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు అల్లం, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసి కలపాలి. మిశ్రమం బాగా దగ్గరయ్యి సంగటిలా ముద్దగా అవుతుంది. పాత్రను స్టవ్ మీద నుంచి దించేసి చల్లారనివ్వాలి. పాలిథిన్ షీట్ మీద వడియాల్లాగ పెట్టాలి. ఈ వడియాలను స్పూన్‌తో పెట్టడం కుదరదు. చేత్తోనే పెట్టాలి. కాబట్టి వేడి తగ్గిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని పిండి కొద్దికొద్దిగా పడేటట్లు మునివేళ్లతో పేపర్ మీద పెట్టాలి. ఈ వడియాలు ఒక్కరోజులోనే ఎండిపోతాయి. ఉదయం పెడితే సాయంత్రానికి ఎండతాయి. వేళ్లతో కదిలించగానే పేపర్ మీద నుంచి ఊడి వచ్చేస్తాయి. లోపల కొద్దిపాటి పచ్చి ఉన్నప్పటికీ అదే రోజు వలిచి పేపర్ మీద ఆరబోసి రెండవ రోజు ఎండలో పెట్టాలి. ఈ వడియాలను వేయించేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం. నూనె వేడెక్కిన తర్వాత వడియాలను నూనెలో వేసిన వెంటనే చిల్లుల గరిటెతో నూనెలో ముంచి కొద్ది సెకన్లపాటు ఉంచితే లోపల కూడా బాగా కాలి పువ్వులా విచ్చుకుంటాయి. రవ్వ వడియాలు కావలసినవి: బొంబాయి రవ్వ – కేజీ పచ్చిమిర్చి– పది జీలకర్ర: టేబుల్ స్పూన్ అల్లం – 50 గ్రాములు ఉప్పు– టేబుల్ స్పూన్ లేదా రుచిని బట్టి నీరు – 8 లీటర్లు సగ్గుబియ్యం – పావు కేజీ నూనె – వేయించడానికి తగినంత తయారీ విధానం: రవ్వను ఒక పాత్రలో వేసి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి. అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి మిక్సీ జార్లో వేయాలి, అందులో జీలకర్ర, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయాలి. పెద్ద పాత్రలో నీటిని పోసి వేడి చేయాలి. నీరు మరగడం మొదలైన తర్వాత గ్రైండ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఆ తరవాత సగ్గుబియ్యాన్ని, నానబెట్టిన రవ్వను వేసి కలియబెట్టాలి. రవ్వ ఉడికి దగ్గరవుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. ఒక నూలు వస్త్రాన్ని తడిపి నేల మీద పరిచి వడియాలు పెట్టాలి. మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని టీ స్పూన్‌తో ఒక్కో స్పూన్ మిశ్రమాన్ని వస్త్రం మీద వేయాలి. ఇలా రవ్వ మిశ్రమం మొత్తాన్ని వడియాలుగా పెట్టాలి. మంచి ఎండల్లో ఒక రోజుకే ముప్పావు వంతు ఎండిపోతాయి. లోపల ఉన్న పచ్చి రెండవ రోజుకు ఎండిపోతుంది. ఇలా రెండు రోజులు ఎండిన తర్వాత వస్త్రానికి వెనుక వైపు నీటిని చల్లి వడియాలను వలవాలి. వలిచిన తరవాత ఒక రోజు ఎండబెట్టాలి. ఇలా తయారైన వడియాలు ఏడాదంతా నిల్వ ఉంటాయి. భోజనానికి పదిమినిషాల ముందు నూనెలో వేయించుకుంటే కరకరలాడే వడియాలు రెడీ. గమనిక: 1. వడియాల మిశ్రమం వేడి తగ్గిన తర్వాత పూర్తిగా చల్లారే లోపు వడియాలు పెట్టేయాలి. మరీ చల్లారితే మిశ్రమం గట్టి పడిపోయి స్పూన్‌తో తీసి వస్త్రం మీద పెట్టేటప్పుడు స్పూన్‌ను వదలకుండా ఇబ్బంది పెడుతుంది. 2. వడియాలు పెట్టడానికి నూలు వస్త్రం లేకపోతే పాలిథిన్ షీట్ మీద పెట్టవచ్చు. మినప్పప్పు వడియాలు కావలసినవి: చాయ మినప్పప్పు – అర కేజీ పచ్చిమిర్చి – 4 అల్లం – అంగుళం ముక్క జీలకర్ర – టేబుల్ స్పూన్ ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ఇంగువ – పావు స్పూన్ నూనె – వేయించడానికి సరిపడినంత తయారీ విధానం: మినప్పప్పును శుభ్రంగా కడిగి మంచినీటిలో నాలుగు గంటలసేపు నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి పప్పును వెట్గ్రైండర్లో రుబ్బాలి (మిక్సీలో గ్రైండ్ చేస్తే వడియం గట్టిగా వస్తుంది, రుచిగా ఉండదు). పప్పు మెదిగేలోపు అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేయాలి. మెత్తగా మెదిగిన తర్వాత జీలకర్ర, ఇంగువ వేసి రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేస్తే వడియాల మిశ్రమం రెడీ. నూలు వస్త్రాన్ని తడిపి దానిమీద వడియాల మిశ్రమాన్ని టీ స్పూన్‌తో పెట్టాలి. రెండు రోజులు ఎండిన తర్వాత వస్త్రానికి వెనుక వైపు నీటిని చల్లి వడియాలను వలవాలి. వలిచిన వడియాలను మళ్లీ ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేయాలి. గమనిక: మినప వడియాలను వేయించేటప్పుడు ఒకింత జాగ్రత్త అవసరం. నూనె బాగా వేడెక్కిన తర్వాత వడియాలను వేసి మంట మీడియంలోకి మార్చాలి. అప్పుడు వడియం లోపల కూడా చక్కగా సమంగా ఎర్రగా వేగుతుంది. మంట తగ్గించకపోతే... వడియం బయటి వైపు ఎర్రగా వేగినప్పటికీ లోపల పచ్చిదనం తగ్గదు. లోపల కూడా వేగేవరకు ఉంచితే వడియం అంచులు మాడిపోతాయి. మరో విషయం... ఈ వడియాలను వేయించి అలాగే తినవచ్చు, కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం -
చిట్టి..చిట్టి మినప వడియాలు.. ఎన్ని లాభాలో..!
వేసవి కాలం వచ్చిందంటే వడియాలు, అప్పడాలు, ఆవకాయ తదితర పచ్చళ్ళ సందడి షురూ అవుతుంది. వీటిని సంవత్సరం మొత్తానికి సరిపోయేలా తయారు చేసుకోవడంలో గృహిణులు చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా గుమ్మడి వడియాలు పిండి వడియాలు, మినప,పెసర వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇలా ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి సులువుగా తయారు చేసుకునే చిట్టి మినప వడియాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..! చిట్టి చిట్టి మినప వడియాలు తయారీకి కావాల్సినవి అరకిలో మినపప్పు (తొక్కతో ఉన్నదైతే వడియాలు గుల్లగా వస్తాయి) పచ్చిమిరపకాయలు బాగా కారం ఉండేవి 10 కొద్దిగా ఉప్పు, జీలకర్ర, కొద్దిగా అల్లం తయారీ ముందు రోజు రాత్రి నాన బెట్టి ఉంచుకున్న మినప పప్పును శుభ్రంగా కడిగి గ్రౌండర్లోగానీ, రోటిలోగానీ మెత్తగా రుబ్బు కోవాలి. ఎక్కువ జారుగా కాకుండా, గట్టి ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి కారం కలిపిన తరువాత మరింత జారుగా అయిపోతుంది పిండి. ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్న పిండిలో ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కారం కలుపుకోవాలి. ఆ తరువాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి(ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు) బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని శుభ్రమైన తడి గుడ్డపై గానీ, ప్లాస్టిక్ కవరైగానీ వేసుకుని ఎండబెట్టుకోవాలి. చక్కగా గల గల మనేలా డేలా ఎర్రటి ఎండలో రెండు మూడు రోజులు ఉంచాలి. వీటిని గుడ్డనుంచి తీసిన తరువాత ఒక బేసిన్లో వేసుకుని మరోసారి ఎండలో పెట్టాలి. పచ్చి లేకుండా బాగా ఎండాయో లేదో చెక్ చేసుకొని వీటిని తడిలేని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ చిట్టి వడియాలు కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయలతో కలిపి ఇగురు కూరలా చేసుకోవచ్చు. చాలా కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. పులుసు కూరల్లో వాడుకోవచ్చు. సైడ్ డిష్‌గా కూడా భలే ఉంటాయి. మినప పప్పులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పిల్లలకు, పెద్దవాళ్లతోపాటు అందరికీ మంచిది. మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది -
మినప వడియాలు చేసుకోండిలా! అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి..
ఎండలు మండిపోతున్నాయి. అందుకే... ఎండబెట్టి వండుకునే వడియాలను చేద్దాం. ఇంతకీ ఇవి అర్కపక్వాలా? అగ్నిపక్వాలా? ఎండలో ఎండుతాయి... మంటకు పొంగుతాయి. వంటకాలకు తోడయ్యి... జిహ్వను సంతోషపరుస్తాయి. సంతృప్తికరమైన భోజనానికి మినిమమ్ గ్యారంటీనిస్తాయి. మినప వడియాల తయారీ ఇలా! కావలసినవి: ►మినప్పప్పు – అర కేజీ ►పచ్చి మిర్చి – 7 లేదా 8 ►జీలకర్ర– టీ స్పూన్ ►అల్లం– రెండు అంగుళాల ముక్క ►ఉప్పు – టేబుల్ స్పూన్. తయారీ: ►మినప్పప్పు కడిగి మునిగేలా నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ►ఉదయాన్నే గ్రైండర్లో మెత్తగా రుబ్బాలి. ►మినప్పప్పు మెదిగేటప్పుడు అందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేయాలి. ►మొత్తం మెత్తగా మెదిగిన తరవాత ఒక గిన్నెలోకి తీసుకుని కలిపితే వడియాల పిండి రెడీ. ►తడి వస్త్రాన్ని లేదా పాలిథిన్ షీట్‌ని ఎండలో పరిచి దాని మీద వడియాలు పెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో స్పూన్ని ముంచి అప్పుడు పిండి తీసుకుంటే పిండి సులువుగా జారుతుంది. ►చేత్తో పెట్టాలన్నా అంతే... వేళ్లను తడుపుకుంటూ పెట్టాలి. రెండు రోజుల పాటు ఎండనివ్వాలి. ►మూడవ రోజు వలిచి మళ్లీ ఎండబెట్టాలి. అప్పుడు గలగలలాడుతాయి. ►ఏడాది పాటు నిల్వ ఉంటాయి. ►నూనె వేడి చేసి పచ్చి వడియాలను నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేగిన తరవాత తీసేయాలి. ►ఈ వడియాలను పెద్ద మంట మీద వేయించరాదు. ►మీడియం ఫ్లేమ్‌లో వేయిస్తే చక్కగా వేగి కరకరలాడుతాయి. ట్రై చేయండి: బూడిద గుమ్మడికాయ, పచ్చి శనగపప్పు.. కన్నడ స్టైల్ మజ్జిగచారు తయారీ ఇలా -
Recipe: టొమాటో, అటుకులు.. వడియాలు తయారు చేసుకోండిలా!
టొమాటో, అటుకులతో వడియాలు తయారు చేసుకోండిలా! కావలసినవి: ►నువ్వులు – 50 గ్రాములు ►టొమాటోలు – పావు కేజీ ►అటుకులు – ఒక కప్పు ►మిరప్పొడి – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►జీలకర్ర – టీ స్పూన్ ►పచ్చిమిర్చి– 3 ►ఉల్లిపాయలు – 3 (తరగాలి) ►కరివేపాకు – నాలుగు రెమ్మలు. తయారీ: ►నువ్వులను కడిగి వడపోసి ఆరబెట్టాలి. ►టొమాటోలను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి వెడల్పుగా ఉన్న పాత్రలో వేయాలి ►పచ్చిమిర్చి, జీలకర్ర, మిరప్పొడి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి టొమాటో ప్యూరీలో కలపాలి. ►ఇందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అటుకులు వేసి కలిపి పది నిమిషాల సేపు నాననివ్వాలి. ►చివరగా నువ్వులు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి. ►తడి వస్త్రం మీద లేదా పాలిథిన్ పేపర్ మీద ఒక్కో గోళీని వడల్లా వత్తి ఎండబెట్టాలి. ►రెండు రోజులు ఎండిన తర్వాత మూడవ రోజు ఉదయం క్లాత్ నుంచి ఒలిచి రెండవ వైపు ఎండబెట్టాలి. -
రేగు వడియాలు.. ఇలా చేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు!
కావలసినవి: రేగుపండ్లు – యాభై; చింతపండు – నిమ్మకాయంత; రాక్ సాల్ట్ – టేబుల్ స్పూను; బెల్లం – పావు కప్పు; ఎండు మిర్చి – ఆరు; జీలకర్ర – అర టీస్పూను; ఇంగువ – టీస్పూను. తయారీ: ► ముందుగా రేగుపండ్లను తొడిమెలు తీసి శుభ్రంగా కడిగి టవల్‌తో తుడిచి ఆరబెట్టాలి ► ఇప్పుడు రోట్లో ఉప్పు, ఎండు మిర్చి వేసి దంచాలి ► ఇవి సగం నలిగాక జీలకర్ర ఇంగువ, రేగుపండ్లు వేసి దంచాలి ► రేగుపండ్లను కచ్చాపచ్చాగా దంచి, విత్తనాలను తీసివేయాలి. రేగుపండ్ల గుజ్జులో చింతపండు, బెల్లం వేసి దంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక కవర్‌పై వడియాలుగా పెట్టుకోవాలి ► వీటిని మంచి ఎండలో ఆరబెట్టాలి. రెండు వైపులా బాగా ఎండిన తరువాత తీసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోవాలి ► నోరు చప్పగా అనిపించినప్పుడు ఈ వడియాలు తింటే పుల్లగా, కారంగా, తియ్యగా తగులుతూ ఎంతో రుచిగా ఉంటాయి. అజీర్తి చేసినప్పుడు, భోజనం సహించనప్పుడు వీటిని చప్పరిస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. -
వేడియాలు
అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఊరగాయలు... తెలుగువారి శుభకార్యాలలో తప్పనిసరిఒకవైపు ఎండలు మరోవైపుపెళ్లిళ్లు ఇంటింటా వడియాలు, అప్పడాల సందడే వారేనా మనమూ పెట్టుకుందాం వడియాలు ఎర్రటి ఎండలో సూర్యుడికి నైవేద్యం పెడదాం ఆయన రుచి చూసి మరింత రుచిగా మనకు అందిస్తాడు ఉల్లిపాయ వడియాలు కావలసినవి ఉల్లి తరుగు – అర కేజీ; మినప్పప్పు – 100 గ్రా.; పచ్చిమిర్చి – 5; ఉప్పు – తగినంత. తయారి ♦ మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి ♦ మిక్సీలో మెత్తగా రుబ్బిన తరువాత, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ♦ పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలిపి ప్లాస్టిక్ పేపర్ మీద వడియాలు పెట్టుకోవాలి ♦ రెండు మూడు రోజులు ఎండిన తరవాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి ♦ నూనెలో వేయించి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. బియ్యప్పిండి వడియాలు కావలసినవి బియ్యం – గ్లాసు; ఉప్పు – తగినంత; జీలకర్ర – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 12; ఎండుకొబ్బరి పొడి – అరకప్పు తయారీ ♦ ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టాలి ♦ బియ్యాన్ని మిక్సీలో వేసి దోసె పిండి మాదిరిగా రుబ్బుకోవాలి ♦ చిన్న పాత్ర తీసుకుని అందులో సగభాగం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి నీళ్లను మరిగించాలి ♦ మరుగుతున్న నీటి పాత్రపై మూత పెట్టి, దాని మీద ముందుగా రుబ్బి ఉంచుకున్న పిండి ముద్దను కొద్దిగా మందంగా చిన్న చిన్న అట్లుగా పోసుకోవాలి ♦ ఆవిరికి అవి పైకి లేస్తాయి. వాటిని ఎండలో ఆరబెట్టాలి. రెండు మూడు రోజులు బాగా ఎండిన తరవాత డబ్బాలోనిల్వ చేసుకోవాలి. నూనెలో వేయించి తినాలి. పొట్టు వడియాలు కావలసినవి పొట్టుమినప్పప్పు ; – పావు కేజీ; పచ్చి మిర్చి – 10; ఉప్పు – తగినంత ; జీలకర్ర – టీస్పూను తయారి ♦ ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టాలి. మరుసటిరోజు శుభ్రంగా కడగాలి. పొట్టు తీయకూడదు ∙పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ♦ కొద్దికొద్దిగా తీసుకుని ప్లాస్టిక్ పేపర్ మీద వడియాలు పెట్టుకోవాలి. నాలుగు రోజులు బాగా ఎండిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కావలసినప్పుడు నూనెలో వేయించుకోవాలి. పులుసు, చారులలో నంచుకుంటే రుచిగా ఉంటుంది. సొరకాయ వడియాలు కావలసినవి అన్నం – రెండు కప్పులు; సొరకాయ గుజ్జు – కప్పు; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – చిన్న కట్ట (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; నూనె – అర కప్పు తయారీ ♦ ఒక పాత్రలో అన్నం, సొరకాయ గుజ్జు, జీలకర్ర, కరివేపాకు తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙ప్లాస్టిక్ పేపర్ మీద వడియాలు పెట్టుకోవాలి ♦ నాలుగు రోజులు బాగా ఎండిన తరువాత గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి ♦ నూనెలో వేయించుకుని, సాంబారు లేదా రసంతో కలిపి తింటే రుచిగా ఉంటాయి. ఉత్తగా అన్నంలో తిన్నా కూడా బాగుంటాయి. అటుకులు దోసకాయ వడియాలు కావలసినవి అటుకులు – ఒక కప్పు; దోసకాయ తురుము – రెండు కప్పులు; జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – టీ స్పూను; పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత తయారీ ♦ అటుకులను ఒకసారి నీళ్లలో వేసి కడిగి తీసేయాలి ♦ దోసకాయ తురుము జత చేయాలి ♦ జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, ఉప్పు... మిక్సీలో వేసి మెత్తగా చేసి, అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలపాలి ♦ చిన్న చిన్న ఉండలుగా చేసి వడియాలు పెట్టాలి ♦ రెండు మూడు రోజులు ఎండిన తరువాత డబ్బాలోకి తీసుకోవాలి ♦ నూనెలో వేయించి అన్నంలో తింటే రుచిగా ఉంటాయి. తెలగపిండి (ఉరుపిండి) వడియాలు కావలసినవి: తెలగపిండి – అర కప్పు; పచ్చిమిర్చి – మూడు; ఉప్పు – తగినంత; వాము – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి రేకలు – 6 తయారి: ♦ తగినన్ని నీళ్లల్లో తెలగపిండిని సుమారు 8 గంటలు నానబెట్టాలి ♦ పచ్చిమిర్చి, ఉప్పు, వాము, వెల్లుల్లి... మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ♦ ఈ మిశ్రమాన్ని తెలగపిండికి జత చేయాలి ♦ చపాతీపిండిలా తయారవ్వాలి ∙చిన్నచిన్న ఉండలు తీసుకుని అరచేతితో ఒత్తి వడియాల మాదిరి ఒత్తి, నువ్వులు అద్ది ఎండలో ఆరబెట్టాలి ♦ ఒక్కరోజు ఎండితే చాలు. వీటిని వేయించవలసిన అవసరం లేదు. పెరుగన్నంలో కాని, మజ్జిగతో కాని తింటే రుచిగా ఉంటాయి. టొమాటో వడియాలు కావలసినవి నువ్వులు – పావు కప్పు; టొమాటో గుజ్జు – కప్పు; అటుకులు – ఒకటిన్నర కప్పులు; కారప్పొడి – ఒకటిన్నర టీ స్పూనులు; ఉప్పు – తగినంత; జీలకర్ర – టీస్పూను; పచ్చిమిర్చి – 3; ఉల్లి తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – కొద్దిగా తయారీ ♦నువ్వులను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ♦ టొమాటోలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి, పచ్చిమిర్చి, జీలకర్ర జత చేసి మెత్తగా గుజ్జు చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ నీటిలో శుభ్రం చేసిన అటుకులు జత చేసి పది నిమిషాలు పక్కన ఉంచాలి ♦ నేల మీద ప్లాస్టిక్ పేపర్ వేసి, కొద్దికొద్దిగా పిండి తీసుకుని గుండ్రంగా వచ్చేలా వడియాలు పెట్టాలి ♦ బాగా ఎండిన తరవాత డబ్బాలోకి తీసుకోవాలి ♦ వీటిని అన్నంలోనే కాకుండా స్నాక్స్‌లా కూడా తింటే బాగుంటాయి. రాగిపిండి వడియాలు కావలసినవి: రాగిపిండి – కప్పు; నీళ్లు – 5 కప్పులు; కారంపొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఇంగువ – చిటికెడు తయారీ: ♦ ఒకపాత్రలో రెండు కప్పుల నీళ్లు, రాగి పిండి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ♦ మిగిలిన నీళ్లను మరిగించి ఉప్పు, కారంపొడి, ఇంగువ వేసి బాగా కలిపాక నీళ్లలో కలిపి ఉంచిన రాగిపిండి వేస్తూ బాగా కలిపి దించేయాలి ♦ ప్లాస్టిక్ కాగితం మీద ఈ పిండిని వడియాలుగా పెట్టుకోవాలి. బూడిద గుమ్మడి కాయ వడియాలు కావలసినవి గుమ్మడికాయ – 1; పొట్టు మినప్పప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి – 100 గ్రా. ; జీలకర్ర – 50 గ్రా.; ఇంగువ – టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ ♦ మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ముందు రోజు రాత్రి నానబెట్టాలి ♦ బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. (గింజలు తీసేయాలి) ♦ ఉప్పు, పసుపు, ఇంగువ జత చేసి ఒక వస్త్రంలో గట్టిగా మూట కట్టి, దాని మీద పెద్ద బరువు పెట్టి రాత్రంతా ఉంచాలి ♦ మరుసటి రోజు ఉదయం మినప్పప్పు పొట్టు తీసి, పచ్చిమిర్చి, ఉప్పు జత చేసి మెత్తగా రుబ్బాలి ♦ బూడిదగుమ్మడికాయ ముక్కలు జత చేయాలి ∙ప్లాస్టిక్ కాగితం మీద నిమ్మకాయ పరిమాణంలో వడియాలు పెట్టాలి ♦ రెండు రోజులపాటు ఎండిన తరవాత, వాటిని జాగ్రత్తగా తీసి, రెండవ వైపుకి తిరగేసి, మరో రెండు రోజులు ఎండనివ్వాలి ∙గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ♦ ఈ వేసవిలో మామిడికాయ పప్పులో వడియాలు నంచుకుని తింటే రుచిగా ఉంటుంది. పేలపిండి వడియాలు కావలసినవి పేలాలు – 500 గ్రా.; సగ్గుబియ్యం – పావు కప్పు; పచ్చిమిర్చి – 30 గ్రా.; వాము – టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత తయారీ ♦ సగ్గుబియ్యాన్ని ఒకటిన్నర కప్పుల నీళ్లలో సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి ♦ మీడియం మంట మీద సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. (ఆపకుండా కలుపుతుండాలి) ∙వాము జత చేసి బాగా కలిపి కిందకు దించేయాలి ♦ మొత్తం పేలాలలో సగం పేలాలను ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి ♦ ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేయాలి. పేలాలు నీటిని పీల్చుకుంటూ పెద్దవిగా అవుతాయి. అప్పుడు మిగిలిన పేలాలు, కప్పుడు నీరు జత చేయాలి ♦ బాగా కలిపి పదినిమిషాలు పక్కన ఉంచాలి ♦ పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసి, పేలాల పిండిలో వేసి కలపాలి. ఉపు జత చేయాలి ♦ఉడికించిన సగ్గు బియ్యం జత చేసి బాగా కలపాలి ♦ ప్లాస్టిక్ కాగితం మీద వడల మాదిరిగా ఒత్తి వడియాలు పెట్టాలి ♦ నాలుగైదు రోజులు ఎండే వరకు ఎండబెట్టాలి. ♦ గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ♦ నూనెలో వేయించుకుని, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. -
వడియాలతో ధ్యాన గణపతి
కడప కల్చరల్: కడప నగరానికి చెందిన యువకుడు వంకదార రాము ప్రతి వినాయక చవితికి తన సృజనను చూపుతూ ఏడాదికి ఒక రకం వస్తువులతో గణపతి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అలాగే ఈ ఏడాది కూడా తన బుర్రకు పదునుపెట్టి వడియాలతో గణపతిని రూపొందించారు. నిజానికి ఆ వీధికి ఊరగాయల (వడియాల) వీధిగా నగరంలో పేరుంది. తమ వీధిలో లభించే వస్తువులతో ఆయన మరో ఏడుగురు స్నేహితులతో కలిసి శ్రీ చక్రాలను పోలిన వడియాలతో పద్మంలో కూర్చొన్న «12 అడుగుల ధ్యాన గణపతిని తయారు చేశారు. వెదురు దెబ్బలు, తడికెలు, కాగితం గుజ్జుతో చేసిన గణపతికి మైదాతో వడియాలను అంటించారు. పర్యావరణానికి హాని చేయని ఈ విగ్రహం తయారీకి రూ. 48 వేలు ఖర్చయిందని రాము తెలిపారు. ఈ విగ్రహానికి పూలమాలలకు బదులుగా 20 వేల పానీపూరీలతో అలంకారం చేయనున్నారు.