మార్చి మూడు వంతులు గడిచింది. ఆహారం ఎండబెట్టే కాలం వచ్చింది. ఏడాదికి సరిపడా నిల్వ చేయాలి. వానల్లో వెచ్చగా వేయించుకు తినాలి. చలిలో కరకరలాడే రుచిని ఆస్వాదించాలి. ఏప్రిల్ నెలకు ఎండ తీవ్రత పెరుగుతుంది. వడగాలి వచ్చి దుమ్మెత్తి పోయకముందే... వడియాలకు దినుసులు సిద్ధం చేద్దాం. ఎండబెట్టమని సూర్యుడికి పని చెబుదాం.
బియ్యప్పిండి వడియాలు
కావలసినవి: బియ్యప్పిండి – ఒక గ్లాసు
సగ్గుబియ్యం – పావు కప్పు
ఎండుమిర్చి – 2
జీలకర్ర – టీ స్పూన్
ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి
నూనె – వేయించడానికి తగినంత.
తయారీ విధానం: ఒక పాత్రలో బియ్యప్పిండి వేసి అందులో రెండు గ్లాసుల నీటిని పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో సగ్గుబియ్యం వేసి మునిగేలా నీటిని పోసి పక్కన పెట్టాలి. మిక్సీలో ఎండుమిర్చిని గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. మెత్తగా గ్రైండ్ కావాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద పాత్రలో ఆరుగ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత ఉప్పు కలపాలి. నీరు మరగడం మొదలైన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలిపి మూత పెట్టాలి. సగ్గుబియ్యం ఉడకడం మొదలైన తర్వాత నానబెట్టిన బియ్యప్పిండిని పోసి కలపాలి.
పిండి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. పిండి ఉడికేటప్పుడు ఎండుమిర్చి పొడి, జీలకర్ర వేసి కలిపి దించేయాలి. వడియాల పిండి వేడి తగ్గేలోపు నూలు వస్త్రాన్ని తడిపి నేల మీద పరిచి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని స్పూన్‌తో వడియాలుగా పెట్టాలి. రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత క్లాత్‌కు వెనుకవైపు నీటిని చల్లి వడియాలను వలిచి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ వడియాలు చాలా త్వరగా వేగుతాయి. నూనెలో వేసిన తర్వాత పొంగి పువ్వుల్లా విచ్చుకోవడం మొదలవుతుంది. అప్పుడు చిల్లుల గరిటెతో నూనెలో ముంచినట్లయితే రెండు వైపులా సమంగా వేగుతాయి. వీటిని తెల్లగా ఉండగానే నూనెలో నుంచి తీసేయాలి. తీయడం ఆలస్యమైతే ఎరుపురంగులోకి మారిపోయి చేదు వస్తుంది.
బియ్యం..సగ్గుబియ్యం వడియాలు
కావలసినవి: బియ్యం – ఒక గ్లాసు
సగ్గుబియ్యం – పావు గ్లాసు
పచ్చిమిర్చి – 2
అల్లం – అంగుళం ముక్క
జీలకర్ర – టీ స్పూన్
ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి
తయారీ విధానం: బియ్యం, సగ్గుబియ్యాన్ని కడిగి మంచినీటిలో నానబెట్టాలి. ఆరు గంటల తర్వాత మిక్సీ జార్‌లో వేసి, తగినంత నీటిని పోస్తూ, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. దోసెల పిండిలాగ మెత్తగా గరిటె జారుడుగా రుబ్బుకోవాలి. మరొక జార్‌లో పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. పెద్ద పాత్రలో ఐదు గ్లాసుల నీటిని పోసి మరిగిన తర్వాత బియ్యప్పిండి మిశ్రమాన్ని పోసి గరిటెతో కలపాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు అల్లం, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసి కలపాలి. మిశ్రమం బాగా దగ్గరయ్యి సంగటిలా ముద్దగా అవుతుంది. పాత్రను స్టవ్ మీద నుంచి దించేసి చల్లారనివ్వాలి. పాలిథిన్ షీట్ మీద వడియాల్లాగ పెట్టాలి.
ఈ వడియాలను స్పూన్‌తో పెట్టడం కుదరదు. చేత్తోనే పెట్టాలి. కాబట్టి వేడి తగ్గిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని పిండి కొద్దికొద్దిగా పడేటట్లు మునివేళ్లతో పేపర్ మీద పెట్టాలి. ఈ వడియాలు ఒక్కరోజులోనే ఎండిపోతాయి. ఉదయం పెడితే సాయంత్రానికి ఎండతాయి. వేళ్లతో కదిలించగానే పేపర్ మీద నుంచి ఊడి వచ్చేస్తాయి. లోపల కొద్దిపాటి పచ్చి ఉన్నప్పటికీ అదే రోజు వలిచి పేపర్ మీద ఆరబోసి రెండవ రోజు ఎండలో పెట్టాలి. ఈ వడియాలను వేయించేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం. నూనె వేడెక్కిన తర్వాత వడియాలను నూనెలో వేసిన వెంటనే చిల్లుల గరిటెతో నూనెలో ముంచి కొద్ది సెకన్లపాటు ఉంచితే లోపల కూడా బాగా కాలి పువ్వులా విచ్చుకుంటాయి.
రవ్వ వడియాలు
కావలసినవి: బొంబాయి రవ్వ – కేజీ
పచ్చిమిర్చి– పది
జీలకర్ర: టేబుల్ స్పూన్
అల్లం – 50 గ్రాములు
ఉప్పు– టేబుల్ స్పూన్ లేదా రుచిని బట్టి
నీరు – 8 లీటర్లు
సగ్గుబియ్యం – పావు కేజీ
నూనె – వేయించడానికి తగినంత
తయారీ విధానం: రవ్వను ఒక పాత్రలో వేసి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి. అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి మిక్సీ జార్‌లో వేయాలి, అందులో జీలకర్ర, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయాలి. పెద్ద పాత్రలో నీటిని పోసి వేడి చేయాలి. నీరు మరగడం మొదలైన తర్వాత గ్రైండ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఆ తరవాత సగ్గుబియ్యాన్ని, నానబెట్టిన రవ్వను వేసి కలియబెట్టాలి. రవ్వ ఉడికి దగ్గరవుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. ఒక నూలు వస్త్రాన్ని తడిపి నేల మీద పరిచి వడియాలు పెట్టాలి.
మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని టీ స్పూన్‌తో ఒక్కో స్పూన్ మిశ్రమాన్ని వస్త్రం మీద వేయాలి. ఇలా రవ్వ మిశ్రమం మొత్తాన్ని వడియాలుగా పెట్టాలి. మంచి ఎండల్లో ఒక రోజుకే ముప్పావు వంతు ఎండిపోతాయి. లోపల ఉన్న పచ్చి రెండవ రోజుకు ఎండిపోతుంది. ఇలా రెండు రోజులు ఎండిన తర్వాత వస్త్రానికి వెనుక వైపు నీటిని చల్లి వడియాలను వలవాలి. వలిచిన తరవాత ఒక రోజు ఎండబెట్టాలి. ఇలా తయారైన వడియాలు ఏడాదంతా నిల్వ ఉంటాయి. భోజనానికి పదిమినిషాల ముందు నూనెలో వేయించుకుంటే కరకరలాడే వడియాలు రెడీ.
గమనిక:
1. వడియాల మిశ్రమం వేడి తగ్గిన తర్వాత పూర్తిగా చల్లారే లోపు వడియాలు పెట్టేయాలి. మరీ చల్లారితే మిశ్రమం గట్టి పడిపోయి స్పూన్‌తో తీసి వస్త్రం మీద పెట్టేటప్పుడు స్పూన్‌ను వదలకుండా ఇబ్బంది పెడుతుంది.
2. వడియాలు పెట్టడానికి నూలు వస్త్రం లేకపోతే పాలిథిన్ షీట్ మీద పెట్టవచ్చు.
మినప్పప్పు వడియాలు
కావలసినవి: చాయ మినప్పప్పు – అర కేజీ
పచ్చిమిర్చి – 4
అల్లం – అంగుళం ముక్క
జీలకర్ర – టేబుల్ స్పూన్
ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి
ఇంగువ – పావు స్పూన్
నూనె – వేయించడానికి సరిపడినంత
తయారీ విధానం: మినప్పప్పును శుభ్రంగా కడిగి మంచినీటిలో నాలుగు గంటలసేపు నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి పప్పును వెట్‌గ్రైండర్‌లో రుబ్బాలి (మిక్సీలో గ్రైండ్ చేస్తే వడియం గట్టిగా వస్తుంది, రుచిగా ఉండదు). పప్పు మెదిగేలోపు అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేయాలి. మెత్తగా మెదిగిన తర్వాత జీలకర్ర, ఇంగువ వేసి రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేస్తే వడియాల మిశ్రమం రెడీ. నూలు వస్త్రాన్ని తడిపి దానిమీద వడియాల మిశ్రమాన్ని టీ స్పూన్‌తో పెట్టాలి. రెండు రోజులు ఎండిన తర్వాత వస్త్రానికి వెనుక వైపు నీటిని చల్లి వడియాలను వలవాలి. వలిచిన వడియాలను మళ్లీ ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేయాలి.
గమనిక: మినప వడియాలను వేయించేటప్పుడు ఒకింత జాగ్రత్త అవసరం. నూనె బాగా వేడెక్కిన తర్వాత వడియాలను వేసి మంట మీడియంలోకి మార్చాలి. అప్పుడు వడియం లోపల కూడా చక్కగా సమంగా ఎర్రగా వేగుతుంది. మంట తగ్గించకపోతే... వడియం బయటి వైపు ఎర్రగా వేగినప్పటికీ లోపల పచ్చిదనం తగ్గదు. లోపల కూడా వేగేవరకు ఉంచితే వడియం అంచులు మాడిపోతాయి. మరో విషయం... ఈ వడియాలను వేయించి అలాగే తినవచ్చు, కూరల్లో కూడా వేసుకోవచ్చు.
ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం
Comments
Please login to add a commentAdd a comment